
ఎస్-400 సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణుల సరఫరాను చైనాకు నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఎప్పుడు ఆ సరఫరా ప్రారంభం అవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నది. ఎస్-400 యాంటీ క్షిపణి వ్యవస్థను చైనాకు అప్పగించడంలో జాప్యం జరగనున్నట్లు రష్యా పేర్కొన్నది. ఇన్‌వాయిస్‌పై సంతకం చేసినంత సులువుగా ఆయుధాలను అందివ్వలేమని రష్యా తాజాగా వెల్లడించింది.
చైనాకు చెందిన సోహూ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఈ విషయం బయటపడింది. ఎస్400 మిస్సైళ్లను డెలవరీ చేయడం చాలా సంక్లిష్టమైన అంశమని, చైనా తమ సిబ్బందిని శిక్షణ కోసం పంపాలని, ఆ ఆయుధాలను వాడకంలోకి తీసుకురావాలంటే అనేక మంది టెక్నికల్ సిబ్బంది అవసరం వస్తుందని రష్యా చెప్పింది.
ప్రస్తుతం కరోనా కాలం నెలకొన్నదని, ఈ సమయంలో ఎస్400 మిస్సైళ్లను సరఫరా చేయడం వల్ల కరోనా మహమ్మారిపై పోరాటానికి విఘాతం ఏర్పడుతుందని రష్యా అభిప్రాయపడింది. పీఎల్ఏ దళాలను ఈ సమయంలో కష్టాల్లోకి నెట్టడం సరికాదన్నది. 2018లో చైనాకు తొలి దఫా ఎస్400 మిస్సైళ్లను అందించినట్లు రష్యా పేర్కొన్నది.
ఎస్400 మిస్సైల్ వ్యవస్థను రష్యాలో అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్‌గా అభివర్ణిస్తారు. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఇది ధ్వంసం చేయగలదు. అంతేకాదు 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న టార్గెట్‌ను కూడా ఈ మిస్సైల్ చిత్తు చేస్తుంది.
చైనా హ్యాకింగ్‌కు పాల్పడినట్లు ఇటీవల రష్యా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్400 క్షిపణుల సరఫరా నిలిపివేయడం డ్రాగన్ దేశానికి ఆందోళన కలిగించే అంశమే. వాస్తవానికి రెండు దేశాల మధ్య మంచి సంబంధాలే ఉన్నా ఇటీవల హ్యాకింగ్ ఆరోపణలతో కొంత టెన్షన్ ఏర్పడింది.
చైనా నిఘా అధికారులకు కొన్ని రహస్య పత్రాలను సెయింట్ పీటర్స్‌బర్గ్ ఆర్కిటిక్ సోషియల్ సైన్సెస్ అకాడమీ అధ్యక్షుడు వాలెరీ మిట్కో చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిస్సైళ్లను చైనాకు అప్పగించడంలో రష్యా జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.
More Stories
ఒడిశా రైళ్ల ఘోర ప్రమాదంపై ప్రపంచ నేతల సంతాపం
ప్రపంచ బ్యాంకు అధ్యక్షునిగా తొలిసారి భారత సంతతి వ్యక్తి
తీవ్ర ఆర్ధిక సంక్షోభం, ద్రవ్యోల్బణంలో పాకిస్తాన్