పాక్ ను బానిసగా మార్చుకొంటున్న చైనా 

పేద దేశాలకు అప్పులిచ్చి వాటిని తన గుప్పిట్లో బంధిస్తున్న చైనా కుతంత్రాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. చైనా పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ) పేరుతో పాక్‌ను కూడా చైనా తన బానిసగా మార్చుకుంటున్నదని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు అలీ సల్మాన్‌ అందానీ ఆరోపించారు. 
 
పాక్‌ను ఏ విధంగా చైనా అష్ట దిగ్బంధనం చేస్తున్నదనే అంశంపై ఆసియా టైమ్స్‌కు రాసిన వ్యాసంలో ఆయన వివరించారు. సీపీఈసీ పేరుతో పాక్‌లో అన్ని మౌలిక వసతులు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలపై ప్రత్యక్ష అధికారంకోసం చైనా చేసిన ప్రతిపాదనను పాక్‌ గత ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఒప్పుకోలేదు. 
 
2016  నుండి ప్రణాళిక మంత్రిత్వ శాఖ పరిధి నుండి  అమలును తీసివేయమని  నవాజ్ షరీఫ్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత సైన్యం మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ చైనా షరతులన్నింటికీ తలాడించారు. దాంతో ఇప్పుడు పాక్‌లోని ప్రతి మంత్రిత్వశాఖ, ప్రతి ప్రభుత్వ సంస్థలో చైనా చెప్పిందే వేదంగా మారింది.
సీపీఈసీ ఒప్పంద పత్రాలను సాక్షాత్తూ పార్లమెంటరీ కమిటీ అడిగినా అధికారులు ఇవ్వలేదంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. పార్లమెంట్ కు సంబంధం లేకుండా అధ్యక్షుడి ఉత్తరువుతో నాలుగు నెలల కాలపరిమితితో  గత అక్టోబర్ లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి మరో నాలుగు నెలలు పొడిగించారు. దానిని శాశ్వత ప్రాతిపదికన చేయమని చైనా ఇప్పుడు వత్తిడి తెస్తున్నది.
పాక్‌లో సీపీఈసీ అధికారిగా చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడే ఉంటారు. అతడికి పాక్‌లో ఏకంగా రాజ్యాంగ హక్కులు సంక్రమించాయి. దాంతో సీపీఈసీకి సంబంధించిన ఏ అంశంపై అయినా చైనా అధికారి నేరుగా విచారణ జరుపగలడు. పాక్‌ ప్రధాని, అధ్యక్షుడికి కూడా జరిమానాలు విధించే అధికారం అతడికి ఉన్నది. దీన్నిబట్టే చైనా చేతిలో పాక్‌ ఎంతగా బంధీ అయ్యిందో అర్థమవుతున్నదని అలీ పేర్కొన్నారు.