టెక్నాలజీ తో స్వాతంత్య్ర వేడుకలు

కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతరమవుతూ ఉండడంతో ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకలను భారీగా నిర్వహించవద్దని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, పరిసరాల శానిటైజేషన్‌ వంటి నిబంధనల్ని పాటిస్తూ కార్యక్రమాల నిర్వహణకు టెక్నాలజీని వినియోగించుకోవాలని చెప్పింది.

ఈ సారి స్వాతంత్య్రదిన వేడుకలకు కోవిడ్‌–19పై ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల్ని ఆహ్వానించి, ఈ సంక్షోభ సమయంలో వారు చేస్తున్న సేవల్ని గుర్తించాలని పిలుపునిచ్చింది.

వైరస్‌పై పోరాడి  కోలుకున్న వారిని కూడా పిలవాలని చెప్పింది. ఆన్‌లైన్‌ ద్వారా కార్యక్రమాలను టెలికాస్ట్‌ చేయాలని వివరించింది.  కాగా, ఎర్రకోటలో కూడా చాలా సాధారణంగానే వేడుకలు జరగనున్నాయి.

సాయుధ బలగాల  గౌరవ వందనం అనంతరం ప్రధాని  జెండా  ఎగురవేస్తారు. ప్రధాని మోదీ ప్రసంగం, జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.  అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ఎట్‌ హోమ్‌ రిసెప్షన్‌ నిర్వహిస్తారు.