హైదరాబాద్ లోని అన్ని డివిజన్ లలో, కాలనీలలో వైరస్ వ్యాపించింది. దానితో చాలా మంది సొంతూళ్లకు పయనమయ్యారు. కొందరైతే హైదరాబాద్‌లో ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. వారి ద్వారా తెలంగాణలోని పలు జిల్లాలు, ఏపీలోని పలు నగరాలకు వారి తాకిడి పెరిగింది. వారితోపాటే కరోనా వైరస్ వలస వెళ్లింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ నెల మొదటి వారం రోజుల్లో 9,227 కేసులు నమోదు కాగా, రెండో వారానికి అవి 6,547కు తగ్గాయి. మూడోవారంలో తొలి ఐదు రోజుల్లో 3,614కు దిగజారాయి. అయితే రాష్ట్ర సగటులో ఏమాత్రం మార్పు లేకుండా, జిల్లాల్లో కేసులు పెరుగుతుండటం హైదరాబాద్ నుంచి వైరస్ జిల్లాలకు తరలివెళ్తోందనే వాదనలకు బలం చేకూరుస్తోంది.
ప్రధానంగా హైదరాబాద్ శివారు జిల్లాల్లో కేసులు ఉధృతమవుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో రికార్డు స్థాయిలో కొవిడ్-19 పాజిటివ్‌లు నమోదవుతున్నాయి.ఈ నెలలో మూడో తేదీ నుంచి కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదు కావడం మొదలయ్యాయి. 3న గ్రేటర్ హైదరాబాద్‌లో ఏకంగా 1,658 కేసులు వచ్చాయి.
అప్పటి వరకు వెయ్యిలోపు కేసులే ఉండేవి. ఆ తర్వాత ప్రతిరోజూ కేసుల సంఖ్య 1,200-1,600 మధ్య ఉండేవి. ఓ దశలో హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సి రావొచ్చనే వాదనలు వినిపించాయి. అయితే ఈ ఉధృతి 8వ తేదీ వరకే కనిపించింది. 9న కేసుల సంఖ్య 918కి, 10న 762కు చేరింది. శనివారం తాజాగా 557 కేసులు నమోదయ్యాయి. మొత్తమ్మీద మూడోవారంలో 557-806 మధ్యనే ఉన్నాయి.
ఈ నెల 1 నుంచి కరోనా ఉధృతరూపు దాల్చగా చాలా వ్యాపార సముదాయాలు స్వచ్ఛంద లాక్‌డౌన్ ప్రకటించాయి. జనరల్‌బజార్, సికింద్రాబాద్, బేగంబజార్, మొజంజాహీ మార్కెట్లు, బంగారు, వస్త్రాల దుకాణాలు కొన్ని వారం రోజుల పాటు దుకాణాలను మూసివేశారు. మరికొన్నిచోట్ల వ్యాపార సమయాలను కుదించారు.
ఇంతకు ముందు ఇంట్లో ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు ఉంటే పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఇప్పపడు అలాంటి లక్షణాలు స్వల్పంగా కనిపించినా భయాందోళనలకు గురవుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకుంటూ, ఫలితాలు వచ్చేదాకా క్వారంటైన్ అవుతున్నారు.
పాజిటివ్ వస్తే సెల్ఫ్‌క్వారంటైన్‌ను కొనసాగిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతికదూరాన్ని పాటించడం వంటివి నిత్యకృత్యాలైపోయాయి. ఇవి కూడా హైదరాబాద్‌లో కేసులు తగ్గడానికి కారణమై ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
More Stories
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!