అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 5వ తేదీన జరుపనున్న భూమిపూజ కోసం వెండి ఇటుకలను కూడా వాడనున్నారు. అయిదు వెండి ఇటుకలతో భూమి పూజ నిర్వహించనున్నారు. తొలి ఇటుకను మోదీ పేర్చనున్నారు.
హిందూ పురాణాల ప్రకారం అయిదు గ్రహాలకు సూచకంగా అయిదు వెండి ఇటుకలను వాడనున్నారు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఇచ్చిన నమూనా ప్రకారమే ఆలయాన్ని నిర్మించనున్నారు. నగర విష్ణు ఆలయం శైలిలో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు. అష్టభుజ ఆకారంలో గర్భాలయం ఉంటుంది.
గతంలో ఇచ్చిన నమూనా కన్నా ఆలయం ఎత్తు, వైశాల్యం, పొడుగును పెంచారు. ముందుగా అనుకున్న మూడు గోపురాల స్థానంలో అయిదు గోపురాలను నిలుపనున్నారు. ఆలయ విస్తీర్ణం సుమారు 76 వేల చదరపు గజాల నుంచి 84వేల చదరపు గజాలు ఉంటుంది. తొలుత కేవలం 38వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కూడా ఈ వేడుకలో పాల్గొనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల్లో ఉన్నారు. రామజన్మభూమి ప్రదేశం వద్ద ఈ సందర్భంగా మూడు రోజుల పాటు వేదఘోష జరగనున్నది.
ఆగస్టు 3వ తేదీన పూజలు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 4వ తేదీన రామాచార్య పూజ నిర్వహిస్తారు. ఆగస్టు 5న మధ్యాహ్నం 12.15 నిమిషాలకు భూమిపూజ చేపట్టనున్నారు. ఫిబ్రవరి 5న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత మోదీ తొలిసారి అయోధ్యకు వెళ్లనున్నారు.
రామాలయ ఉద్యమంలో శివసేన పాత్ర ఉన్న కారణంగా ఆ పార్టీకి కూడా ఆహ్వానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కూల్చివేత కేసులో ఉద్దవ్ తండ్రి బాలాసాహెబ్ థాకేరే పేరు ఉన్నది. కానీ ఆయన మరణించిన తర్వాత కేసు నుంచి పేరును తొలగించారు. మార్చి నెలలో మహా సీఎం ఉద్దవ్ థాకేరే అయోధ్యను సందర్శించారు. . ఆలయ నిర్మాణం కోసం కోటి రూపాయల విరాళాన్ని కూడా ప్రకటించారు.
More Stories
మిత్రుడు ట్రంప్ కు ప్రధాని మోదీ అభినందనలు
అమెరికన్లకు ఇక స్వర్ణయుగమే
తెలుగు వారి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు