వ్యాక్సిన్ తయారీలో 7 భారతీయ సంస్థలు 

కోరలు చాస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం వ్యాక్సిన్ తయారు చేయాలని అంతర్జాతీయ ఫార్మా సంస్థలతో పాటు పలు దేశీయ కంపెనీలు కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌, జైడస్‌ కాడిలా, పనాసీ బయోటెక్‌, ఇండియన్‌ ఇమ్యునాలజికల్స్‌, మైన్‌వ్యాక్స్‌, బయోలాజికల్‌ ఈ అనే ఏడు దేశీయ సంస్థలు వ్యాక్సిన్‌ రేసులో ముందున్నాయి.
 
సీరం ఇన్‌స్టిట్యూట్‌: ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనికా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న  ChAdOx1 nCoV-19 టీకా తయారీలో పుణెకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ భాగస్వామిగా ఉన్నది. 
 
ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ మూడో క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నదని, అన్ని సవ్యంగా జరిగితే ఈ ఏడాది చివరినాటికి టీకా అందుబాటులోకి వస్తుందని సీరం సీఈవో అదర్‌ పూనావాల తెలిపారు. 
 
టీకా కీలక సమాచారం, ట్రయల్స్‌ వివరాలను అనుసరించి ఆగస్టు నుంచి భారత్‌లో కూడా హ్యూమన్‌ ట్రయల్స్‌ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కరోనా టీకా అభివృద్ధికి అమెరికాకు చెందిన కొడాజెనిక్స్‌తో కూడా జట్టు కట్టినట్టు వివరించారు. 
 
జైడస్‌ కాడిలా: ‘జైకోవ్‌-డీ’ పేరిట జైడస్‌ కాడిలా ఫార్మా సంస్థ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఇండియన్‌ డ్రగ్‌ రెగ్యులేటరీ అనుమతులతో గత వారం మనుషులపై మొదటి దశ హ్యూమన్‌ ట్రయల్స్‌ ప్రారంభించింది. 
 
కీలకమైన ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ ఆశాజనక ఫలితాలను ఇచ్చినైట్లెతే, మరో ఏడు నెలల్లో టీకాను అందుబాటులోకి తీసుకువస్తామని జైడస్‌  కాడిలా చైర్మన్‌ పంకజ్‌ ఆర్‌ పటేల్‌ తెలిపారు. 
 
ఇండియన్‌ ఇమ్యునాలజికల్స్‌: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్‌ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తామని ఇండియన్‌ ఇమ్యునాలజికల్స్‌ ఒప్పందం చేసుకున్నది. 
 
ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ప్రస్తుతం చిన్న జంతువులపై టీకాను పరీక్షిస్తున్నామని, డిసెంబర్‌ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని ఇండియన్‌ ఇమ్యునాలజికల్స్‌ ప్రతినిధులు తెలిపారు. 
 
పనాసీ బయోటెక్‌: అమెరికాకు చెందిన రెఫానా సంస్థతో కలిసి పనాసీ బయోటెక్‌ కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నది. ట్రయల్స్‌లో టీకా విజయవంతమైతే వచ్చే ఏడాది నాటికి 4 కోట్ల డోసుల టీకాను ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
 
మైన్‌వ్యాక్స్‌ & బయోలాజికల్‌ ఈ: కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌ అభివృద్ధి కొనసాగుతున్నదని, మరో 18 నెలల్లో టీకాను అందుబాటులోకి తీసుకువస్తామని  మైన్‌వ్యాక్స్‌ వెల్లడించింది. మరోవైపు, కరోనా టీకా కోసం ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌ను సిద్ధం చేసినట్టు బయోలాజికల్‌ వివరించింది.
 
భారత్‌ బయోటెక్‌ : భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌’ పేరిట టీకాను అభివృద్ధి చేస్తున్నది. 
 
ఈ వ్యాక్సిన్‌పై మొదటి, రెండో క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు ఇండియన్‌ డ్రగ్‌ రెగ్యులేటరీ అనుమతులను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 375 మంది వలంటీర్లపై మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్టు సంస్థ శుక్రవారం ప్రకటించింది.