తెలంగాణ గడ్డపై మావోయిస్టు ఆగడాలు సాగనివ్వం 

ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు ఆగడాలను తిరిగి తెలంగాణ గడ్డ మీద జరగనివ్వబోదని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.  ఏటూరు నాగారం సబ్ డివిజన్ లోని, వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో ములుగు, భూపాలపల్లికి చెందిన పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంనిర్వహించారు.
మావోయిస్టులు మళ్లీ తెలంగాణలో ప్రవేశించి, హింసాత్మక చర్యలకు పూనుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో తెలంగాణ పోలీస్ శాఖ.. ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు ఆగడాలను ఈ గడ్డ మీద జరగనివ్వబోదని రాష్ట్ర‌ ప్రజలకు భరోసా ఇచ్చారు.
దాదాపు పది సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల కోపానికి గురై, ఇక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయిన మావోయిస్టులు తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రజల కోపానికి గురి కాకూడదని హెచ్చరించారు.  తెలంగాణలో 30 ఏండ్లపాటు నక్సల్స్‌‌‌‌ సృష్టించిన రక్త చరిత్రను ప్రజలంతా చూశారని చెబుతూ  ప్రజలు తిప్పికొట్టడం వల్లే మావోయిస్టులు రాష్ట్రాన్ని వదిలేసి చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌కు పారిపోయారని గుర్తు చేసారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అయినటువంటి హరి భూషణ్, దామోదర్ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలిపశువులుగా చేస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టులకు ఎవరూ సహకరించకుండా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపిచ్చారు.
తెలంగాణలో ఉండే డాక్టర్లు, ఇంజనీర్లను, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయాలనే ఎత్తుగడలతో తిరిగి మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టాలని మావోయిస్టులు చేసే ప్రయత్నాలను తెలంగాణ పోలీస్ శాఖ సమర్థంగా తిప్పి కొడుతుందని స్పష్టం చేసారు.
తెలంగాణలో ప్రతి గ్రామం రహదారులతో అనుసంధానింపబడి విద్య, వైద్యం వంటి సదుపాయాలను పొందుతూ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్న ఈ సమయంలో మావోయిస్టులు తిరిగి తెలంగాణలో అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారని అప్రమత్తం చేశారు.