22న బల పరీక్షకు గెహ్లాట్ సన్నాహం 

రాష్ట్ర శాసన సభలో బల పరీక్షకు దిగడం ద్వారా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అస్థిరతకు మంగళం పాడాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సన్నాహాలు జరుపుతున్నారు. ఈ నెల 22న ఆయన బల పరీక్ష జరుపుకోవచ్చని తెలుస్తున్నది. 
 
 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 19 మందికి స్పీకర్ అనర్హతా నోటీసులు ఇవ్వడం జరిగింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు‌, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కలిపితే మొత్తం 109 మంది సభ్యుల మద్దతు తమకు ఉన్నట్టు అధికార కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.  

బలపరీక్షకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను శనివారంనాడు అశోక్ గెహ్లాట్ కలుసుకుని, తమ పార్టీకి ఇద్దరు భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) ఎమ్మెల్యేలు ఇచ్చిన మద్దతు లేఖలను అందజేసిన నేపథ్యంలో బలపరీక్షకు గెహ్లాట్ సిద్ధమవుతున్న సంకేతాలు వెలువడ్డాయి.

గవర్నర్‌, ముఖ్యమంత్రి సుమారు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారని, ఈ సమావేశంలో కరోనాపై పోరాటానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గెహ్లాట్ వివరించారని రాజ్‌భవన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదే సమయంలో, తమ ప్రభుత్వానికి బీటీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన మద్దతు లేఖల గురించి తెలియజేసి తమకు పూర్తి మెజారిటీ ఉన్న విషయాన్ని వివరించినట్టు తెలుస్తోంది. 

రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉండాలనే షరతుతో గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ అధ్యక్షుడు, ఇతర నేతలు అంగీకిరించినట్టు బీటీపీ శాసనసభ్యులు రాజ్‌కుమార్ రోయత్, రామ్ ప్రసాద్ మీడియాకు తెలిపారు.

అనర్హత నోటీసులపై తిరుగుబాటు నేత సచిన్ పైలట్ దాఖలు చేసిన పిటిషన్ ను హై కోర్ట్ ముందుకు మంగళవారం రానున్నది. అందుకనే కోర్ట్ లో ఏమి జరుగుతుంది చూసి, మరుసటి రోజు బలపరీక్షకు సిద్ధపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అంతర్గత కలహాలతో తాము జోక్యం చేసుకోమని సంకేతం బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఇవ్వడం గమనార్హం.