రైతులకు చేరని సున్నా వడ్డీ బకాయిలు రూ.1,100 కోట్లు

రైతులకు చేరని సున్నా వడ్డీ బకాయిలు రూ.1,100 కోట్లు

ఈ నెల 8న రైతు దినోత్సవం రోజున వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం విడుదల చేశామంటున్న సున్నా వడ్డీ బకాయిలు రూ.1,100 కోట్లు  పదిరోజులవుతున్నా  రైతులకు చేరలేదు. ఐదేళ్ల నుంచి పేరుకుపోయిన సున్నా వడ్డీ  బకాయిలు లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశామంటూ సర్కారు చేసిన హడావిడితో కరోనా సమయంలోనూ రైతులు బ్యాంకులకెళ్లి సంప్రదిస్తున్నా.. నిరాశే ఎదురవుతోంది. 

సొమ్ము ఇంకా తమ దాకా రాలేదని బ్యాంకర్లు చెబుతుండటంతో రైతులు వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ బకాయిలు ఖరీఫ్‌ పెట్టుబడులకు అక్కరకొస్తాయని ఎంతో ఆశ పడ్డ రైతులకు శుక్రవారం సాయంత్రానికి కూడా అకౌంట్లలో జమ కాక పోవడంతో నిరాశ ఎదురవుతున్నది.  

మాజీ సిఎం వైఎస్‌ఆర్‌ జన్మదినం రోజున రైతులకు తీపి కబురంటూ టిడిపి హయాంనాటి ఐదేళ్ల సున్నా వడ్డీ బకాయిలను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే రోజున బ్యాంకులకు కాకుండా నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసేశామనీ తెలిపింది. దాదాపు 57 లక్షల మంది అన్నదాతలకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందని పేర్కొంది.

ప్రభుత్వ ప్రచారంతో రైతులు తమ మొబైల్‌ ఫోన్లకు సొమ్ము జమ అయినట్లు వచ్చే బ్యాంకుల మెసేజ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. చాలా మంది రైతులు బ్యాంకులకెళ్లి సున్నా వడ్డీ జమపై వాకబు చేస్తున్నారు. ప్రభుత్వం డబ్బు విడుదల చేసినట్లు మీడియా ద్వారానే తమకూ తెలిసిందని, ఇంకా తమకు చేరలేదని బ్యాంకు అధికారులు వాపోతున్నారు.

సహకార  బ్యాంకులకు కూడా ప్రభుత్వం విడుదల చేసిన సొమ్ము రాలేదని తెలుస్తున్నది. 2014-15 నుంచి 2018-19 సంవత్సరాల వడ్డీ బకాయిలు విడుదల చేశామంటున్నారని, రైతులు ఇప్పటికే వడ్డీలు చెల్లించి ఉన్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ము వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తామని, వడ్డీలు చెల్లించని పక్షంలో మినహాయించుకుంటామని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) అధికారులు వెల్లడించారు.