వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పంపిన రాజధాని బిల్లుకు ఆమోదం తెలుపవద్దని కోరుతూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.
పరిపాలన వికేంద్రీకరణ (మూడు రాజధానులు ) , సిఆర్డిఏ చట్టం రద్దు బిల్లులను ఈ రోజు గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపడంతో కన్నా ఈ లేఖ వ్రాసారు. గవర్నర్ ఆమోదం తరువాత రాష్ట్రపతి ఆమోదం పొందేదుకుగాను ఈ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పంపగలరని భావిస్తున్నారు.
‘రాష్ట్ర ప్రభుత్వం పంపిన క్యాపిటల్ బిల్లులకు మీరు అంగీకారం తెలపవద్దని విజ్ఞప్తి. రాజధాని ప్రాంత అభివృద్ధి చట్టం, 2014ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం. వాస్తవ పరిస్థితిని మీకు వివరించేందుకే ఈ లేఖ రాశాను” అంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ రెండు బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపగా అది పెండింగ్‌లో ఉందని కన్నా గుర్తు చేశారు. వికేంద్రీకరణపై బిల్లు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014కు వ్యతిరేకంగా ఉందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అమరావతి బాండ్ల అమ్మకం ద్వారా గత ప్రభుత్వం రూ.2,000 కోట్లు సమీకరించిందని ఆయన గుర్తు చేశారు.
అమరావతి అభివృద్ధికి కేంద్రం కూడా ఆర్థిక సహాయం అందించిందని పేర్కొంటూ అమరావతి ప్రాంతంలో ఒకే రాజధాని మాత్రమే ఉంటుందని, ఒప్పందంపై రైతులు 32,000 ఎకరాల సారవంతమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి త్యాగం చేశారని కన్నా వివరించారు. రాజధాని ప్రాంత రైతుల నిరంతర శాంతియుత, ప్రజాస్వామ్య ఆందోళనను పరిశీలించాలని ఆయన గవర్నర్ ను కోరారు.
రాజధాని వికేంద్రీకరించడానికి ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యలు. అభివృద్ధికి సహకరించిన వాటాదారులందరికీ ఆమోదయోగ్యం కాదని కన్నా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించడం లేదని తేల్చి చెప్పారు. ప్రజలు, రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ తరపున ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
కాగా, రాజ్యాంగ ప్రకారం సంఘర్షణకు దారి తీసే చర్యలను ఆమోదించొద్దని మాజీ ఆర్ధిక మంత్రి, టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గవర్నర్ కు వ్రాసిన మరో లేఖలో విజ్ఞప్తి చేశారు. అవసరమైతే భారత అటార్నీ జనరల్ అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ రెండు బిల్లులను 2014లో పార్లమెంట్ ఆమోదించిన చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసారు.
More Stories
జార్ఖండ్ నుండి చొరబాటుదారులను తరిమికొడతాం
నవంబర్ 11 నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ, హర్యానా, మణిపూర్ లలో ప్రైవేట్ పాఠశాలల వైపే మొగ్గు!