పెద్దజీయర్‌ స్వామికి కరోనాతో తిరుమలలో కలకలం 

కరోనా వైరస్‌ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కుదిపేస్తున్నది. ఇప్పటికే టీటీడీకి చెందిన 15 మందికిపైగా అర్చకులు కరోనా బారినపడ్డారు. తాజాగా శ్రీవారి ఆలయ పెద్దజీయర్‌ స్వామికి కరోనా నిర్ధారణ అయ్యింది. 

ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. చాతుర్మాస దీక్షలో ఉన్న జీయంగార్‌ కోరిక మేరకు వైద్య సేవలు అందించాలని వైద్యులను టీటీడీ ఈవో అనిల్ కుమార్  సింఘాల్ ఆదేశించారు. ఇవాళ సాయంత్రం లోపు ఆయన్ను తిరుపతిలోని మఠానికి తరలించే అవకాశం ఉంది.

మొదట ఆయన్ను చికిత్స నిమిత్తం చెన్నై అపోలోకు తరలించాలని టీటీడీ అధికారులు భావించారు. అయితే ఈ నెల 5వ తేదీన పెద్ద జీయర్ చాతుర్మాస దీక్ష తీసుకున్నారు. జీయర్ దీక్షలో ఉన్న సమయంలో పొలిమేరలు దాటకూడదని నిబంధన ఉంది. ఆరోగ్య రీత్యా ఈ ఉదయం పద్మావతి కోవిడ్ సెంటర్‌కు టీటీడీ అధికారులు తరలించారు. 

సాయంత్రంలోపు జీయర్‌ను పెద్ద జీయర్ మఠానికి తరలించి, మఠంలోనే వైద్యం అందించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. కాగా జీయర్‌కు స్వయంగా సేవలు అందించేందుకు శిష్య బృందం ముందుకొచ్చింది. 

మరోవంక, తిరుమలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసే అంశాన్ని దేవస్థాన అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మార్చి 20న తిరుమల దేవస్థానాన్ని మూసివేశారు. భక్తుల దర్శనాలను నిలిపివేసి, స్వామివారి నిత్య కైంకర్యాలను కొనసాగించారు.

అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో సుమారు 80 రోజుల తర్వాత.. జూన్‌ 11న శ్రీవారి ఆలయాన్ని తెరిచారు. అప్పటి నుంచి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.

అయితే ఆలయంలో పనిచేస్తున్న 18 మంది అర్చకులతో  నిన్నటి వరకు స్థానికులతో కలిపి 158 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారికంగా పోలీస్ అధికారులు వెల్లడించారు.  మొత్తం 50 మంది అర్చకులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, 18మందికి నిర్ధారణ అయ్యింది. మరో 21 మందికి సంబంధించిన ఫలితాలు ఇంకా వెళ్లడికాలేదు.