వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సిబిఐ రంగంలోకి దిగింది. ఎపి హైకోర్టు ఆదేశాలతో సిబిఐ అధికారులు శనివారం విచారణ ప్రారంభించారు. కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి అన్బురాజన్‌తో ఏడుగురు సిబిఐ అధికారులు సమావేశమయ్యారు.
గత ఏడాది మార్చి 15న జరిగిన వివేకా హత్య కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పులివెందులకు వెళ్లి క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టనున్నారు. వివేకా హత్య కేసును సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అమాయకులను ఇరికించి.. అసలైన నేరస్థులను వదిలేస్తారేమో..? అని సందేహం కలుగుతోందని హైకోర్టు లో ఆమె వాదన వినిపించారు. 15 మందిపై తనకు అనుమానం ఉందని వారి పేర్లను వెల్లడించారు. దాంతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు కడప జిల్లా పులివెందుల పోలీసుస్టేషన్‌ కేంద్రంగా దర్యాప్తు సాగాలని ఈ తీర్పులో వెల్లడించింది.
దీనిపై విచారణ చేపట్టి ధర్మాసనం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ సంచలన తీర్పును నాలుగు నెలల క్రితం ఇచ్చింది. హత్య జరిగి ఏడాది గడుస్తున్నా ‘మిస్టరీ’ ఇంకా వీడలేదని అప్పట్లో వ్యాఖ్యానించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం  (సిట్‌)రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆధ్వర్యాన ఇప్పటికే ఈ కేసుపై మూడుసార్లు విచారణ జరిగింది.
దాదాపు 1,300 మంది అనుమానితులను విచారించినా హంతకులను గుర్తించలేదని హైకోర్టు ఆక్షేపించింది. కేసుపై విచారణ చేపట్టాలని సిబిఐని ఆదేశించింది. జిల్లాలోని కడప, పులివెందులలో వారం రోజులపాటు సిబిఐ అధికారులు మకాం వేయనున్నారు.
సునీత సమర్పించిన అనుమానితుల జాబితాలో జగన్ కు సన్నిహితులైన కడప ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి (అవినా్‌షరెడ్డి తండ్రి), వైఎస్‌ మనోహర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి (ఎంపీ అవినా్‌షరెడ్డికి సన్నిహితుడు) పేర్లు ఉండడం గమనార్హం. దానితో హత్యా జరిగిన సమయంలో సిబిఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తును తీవ్రంగా వ్యతిరేకించారు.
వివేకా హత్య కేసుకు సంబంధించి సిట్‌ విచారణ అధికారి, పులివెందుల డిఎస్‌పి వాసుదేవన్‌ను విచారించనున్నట్లు తెలిసింది. హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, పిఎ క్రిష్ణారెడ్డి, డ్రైవర్‌ ప్రకాష్‌, వాచ్‌మెన్‌ రంగయ్యలను విచారించనున్నట్లు చెబుతున్నారు.
హత్యకు కారణం భూమి, ఆస్తి తగాదాలా? అనేది సిట్‌ తేల్చలేకపోయిందని, హత్య ఘటన ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాల వ్యక్తుల జోక్యం ఉండవచ్చని హైకోర్టు అప్పట్లో సందేహం వెలిబుచ్చింది. ఇలాంటి కేసుల దర్యాప్తులో సమయం చాలా కీలకమైందని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకొని ఈ కేసును సిబిఐకి అప్పగించింది.