పీవోకేలో   సింధూ నదిపై పాక్ డ్యామ్ 

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్‌-బాల్టిస్థాన్‌లో సింధూ నదిపై డయామర్‌-భాషా డ్యామ్‌ పనులను పాక్‌ ప్రారంభించింది. పీవోకేలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న భారత్‌ అభ్యంతరాలను పెడచెవిన పెట్టింది. పాక్‌ చర్యలకు దాని మిత్ర దేశం చైనా మద్దతిస్తున్నది. 

దాదాపు రూ. 11వేల కోట్ల విలువైన ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందజేస్తున్నది. బుధవారం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైనా రాయబారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ 2028నాటికి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు 

ఈ డ్యామ్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపించారు. డ్యామ్‌ నిర్మాణాన్ని కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. ఇది పాకిస్థాన్‌లోనే మూడో అతిపెద్ద డ్యామ్‌ అని చెప్పారు. దీనివల్ల భారీ స్థాయిలో ఉద్యోగకల్పన జరుగుతుందని చెప్పారు. 

ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో దాదాపు 70శాతం చైనానే సహాయంగా అందిస్తున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా 4,500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని అంచనాగా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం భారత్‌, చైనా మధ్యన ఉన్న ఉద్రిక్తతలు ఈ ప్రాజెక్టు కారణంగా మరింత పెరిగే అవకాశం ఉండొచ్చు.

ఈ ప్రాజెక్టుకు 2010లోనే పాక్‌లోని కౌన్సిల్‌ ఆఫ్‌ కామన్‌ ఇంట్రెస్ట్‌(సీసీఐ) అమోదం తెలిపింది. 2011లో శంకుస్థాపన చేశారు. అయితే భారత్‌ దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. వివాదాస్పద భూభాగంలో నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించింది. 

దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి అప్పులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సహా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిరాకరించాయి. ఫలితంగా పాకిస్థాన్‌ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది. తాజాగా చైనా సహాయంతో పాకిస్థాన్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచింది.

మరోవంక, టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌లో డిజిటైజేషన్‌ ఫండ్‌ కింద రూ. 75 వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై విమర్శల వెల్లువ మొదలైంది. ‘పాకిస్థాన్‌కు ఏం బాధలేదు. అక్కడ నిధులు ఉంటే.. మాకు ఇక్కడ గూగుల్‌ డూడుల్స్‌ ఉన్నాయి’ అని పాక్‌ జర్నలిస్టు నైనా ఇనాయత్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. తమదేశంలోకి పెట్టుబడులు రాకపోవడంపై విమర్శలు గుప్పించారు.