తెలంగాణలో కరోనా టెస్టులు పెంచాలి 

తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిని సందర్శించి, కోవిడ్ చికిత్స ఏర్పాట్లను పరిశీలిస్తూ కరోనా టెస్టులు పెంచ‌డం వ‌ల్ల కరోనా రోగులను గుర్తించడం సులభతరమవుతుందని చెప్పారు. 

కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు అధికం అవుతున్నాయని పేర్కొంటూ ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. కరోనాపై ‌తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. 

కరోనా బాధితుల పట్ల వివక్ష చూపడం మానుకోవాలని కోరుతూ కిరాయి ఇళ్లలో ఉంటున్న వారికి పాజిటివ్ వస్తే యజమానులు వారిని ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఎవరి ఇంట్లో వారు ఉంటే ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవ‌ని తెలిపారు. ప్రభుత్వం మాట్లాడితే ప్రయివేటు మెడికల్ కళాశాలలు కూడా కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ వైద్యులు, పారామెడికల్ సిబ్బందిపై భారం పడకుండా ప్ర‌భుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సంజయ్ కోరారు. ప్రయివేటు డాక్టర్లు కూడా ప్రభుత్వానికి సహకరించాల‌ని, సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పారు.

కోవిడ్ నియంత్రణ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పటికే రూ 31,464 కోట్ల నిధులు తెలంగాణకు విడుదల చేసిందని సంజయ్ చెప్పారు 7.44 లక్షల ఎన్.95 మాస్కులు, 3.41 లక్షల పీపీఈ కిట్లు, 22.50 లక్షల హైడ్రోక్లోరో క్వీన్ టాబ్లెట్లు, 3 లక్షల టెస్టింగ్ కిట్లు కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చాయని తెలిపారు.