వర్షానికి వరదమయం ఉస్మానియా ఆసుపత్రి 

వర్షానికి వరదమయం ఉస్మానియా ఆసుపత్రి 
ప్రపంచంలోనే అతి పురాతన ఆసుపత్రిలలో ఒకటిగా హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిని చెప్పుకోవచ్చు. మూడు దశాబ్దాల క్రితం వరకు మొత్తం దక్షిణాదిలోనే మేటి ఆసుపత్రిగా పేరుండెడిది. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు అన్ని రకాల చికిత్సలకు అక్కడనే చేరేవారు. కానీ నేడు శిధిలావస్థలో ఉంది. 
 
బుధవారం నగరంలో కురిసిన వర్షాలకు ఆసుపత్రి అంతా వరదమయంగా మారింది. క్రింది అంతస్థులో అన్ని వార్డ్ లలోకి నీరు చేరింది. మెట్లపై నుండి జలపాతం వలే నీరు కిందకు ప్రవహించింది. ప్రభుత్వాల నేరమయ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఈ ఆసుపత్రి నిలిచింది. 
 
అయితే కార్పొరేట్ ఆసుపత్రుల ఆధిపత్యం ప్రారంభమైనప్పటి నుండి ప్రభుత్వాలే ఉద్దేశపూర్వకంగా ఈ ఆసుపత్రిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. అక్కడ పరికరాలు పనిచేయకుండా ఉండేటట్లు చేయడం, తగినంతమంది వైద్యులను నియమించక పోవడం, రోగులకు తగు సదుపాయాలు కల్పించకపోవడం, భవనాలను మరమ్మత్తులు చేయకపోవడం చేస్తూ వచ్చారు. 
 
1868లో నిజాం నవాబ్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించిన ఈ ఆసుపత్రిని అధికారంలోకి వచ్చి ఏడాది అయిన తర్వాత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 2015లో సందర్శించి శిధిలావస్థలో ఉన్న భవనాలను పునర్నిర్మిస్తానని ప్రకటించారు. 
 
ఆసుపత్రిని తాత్కాలికంగా ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రక్కకు మార్చి, వారసత్వ భావనమైనా లెక్కచేయకుండా శిధిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేసి రెండు భారీ టవర్స్ రూపంలో నూతన భవనాలు నిర్మిస్తానని వెల్లడించారు. 
 
ఈ  హామీ ఇచ్చి ఐదేళ్లయింది. తిరిగి కేసీఆర్ అటువైపు చూడనే లేదు. ఆయనపై కూడా కార్పొరేట్ ఆసుపత్రుల నుండి వత్తిడి వచ్చిందా? ఎందుకంటె ఈ ఆసుపత్రిని అత్యాధునికం కావిస్తే నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులకు గిరాకి తగ్గుతుంది. 
 

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇవాళ ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించిన అక్కడున్న పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత మంది ప్రాణాలు పోతే సీఎం కేసీఆర్ ఈ ఆసుపత్రిని సందర్శిస్తారని ప్రశ్నించారు.  సచివాలయ నిర్మాణం ఆపి.‌.‌ పేదలకు వైద్యం అందించే  ఆస్పత్రిని నిర్మించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.