త్వరలో 100 శాతం రైల్వేల విద్యుద్దీకరణ   

రాబోయే మూడున్నరేళ్లలో 100 శాతం రైల్వేల విద్యుద్దీకరణ జరుగుతుందని, 2030 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద ‘క్లీన్ రైల్వేస్‌’గా భారత్ నిలుస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.
 
ఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేష్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ  2030 నాటికి మనమంతా గర్వించేలా ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ రైల్వేస్‌‌గా భారత్ నిలుస్తుందని చెప్పారు. 
 
 ‘ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచ, ఒకే గ్రిడ్ విధానాన్ని ప్రధాని ప్రమోట్ చేస్తున్నారు. అంతర్జాతీయ రెనవబుల్ కమ్యూనిటీలో భారత్ కీలక భూమిక పోషిస్తుంది. ఇంటర్నేషనల్ సోలార్ గ్రిడ్ రూపాంతరంలో మన పాత్ర కూడా ఉటుంది. పీఎం-కుసుమ్ యోజనతో రైతులను కూడా సోలార్ ఎనర్జీ గ్రిడ్‌ పరిధిలోకి తీసుకు వస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు. 
 
పునరుత్పత్తి ఇంధనం ట్రాన్సిషన్‌లో ప్రపంచానికి భారత్ ఒక నమూనాగా నిలుస్తుందని ప్రధాని చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇందువల్ల భారత్ లో  ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను సరసమైన ధరలకు పొందగలుగుతున్నారని గుర్తు చేశారు.
 
ట్రాన్స్‌మిషన్ రంగం‌లో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని చెబుతూ అందరూ భరించగలిగే చార్జీలకు నిరంతరాయ విద్యుత్‌ను అందించాలనే ప్రయత్నాలకు రాష్ట్రాలు దన్నుగా నిలుస్తాయనే నమ్మకం తనకుందని చెప్పారు.

పునరుత్పత్తి ఇంధనం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందిని, దేశం కూడా ఆర్థికంగా బలపడుతుందని పీయూష్ గోయెల్ విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఇంధనం డిమాండ్ పెరిగి, ధరలు కూడా తగ్గుతాయని భరోసా వ్యక్తం చేశారు. తద్వారా ఉత్పత్తుల పెంపు జరిగి, ప్రజలు స్వయం సమృద్ధి చెందుతారని, ఇందుకు రాష్ట్రాల సహకారం కూడా అవసరమని చెప్పారు. 

రెనెవబుల్ ఎనర్జీని ప్రోత్సహించడం మేక్ ఇన్ ఇండియాలో భాగమని, ఇండస్ట్రీ ఆత్మనిర్భర్‌కు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మనం స్వయం సమృద్ధి సాధిస్తే, దేశీయ ఉత్పత్తులు పెరిగి, నాణ్యతలోనూ ఎలాంటి రాజీ ఉండదని ఆయన చెప్పారు. 

అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులతో ప్రపంచ దేశాలతో వాణిజ్యాన్ని విస్తరించుకోవాలని భారత్ పట్టుదలగా ఉందని పీయూష్ గోయెల్ తెలిపారు.

ప్రస్తుతం భారత్ లో 40 వేల కిలో మీటర్ల (ఆర్‌‌కేఎం) పైచిలుకు విద్యుద్దీకరణ పూర్తయింది. దీన్ని మొత్తం బ్రాడ్–గేజ్ రూట్స్‌లో 63 శాతంగా చెప్పొచ్చు. 2020–2021 ఏడాదిలో 7 వేల ఆర్‌‌కేఎం విద్యుదీకరణ పూర్తి చేయాలని భారతీయ రైల్వేలు లక్ష్యంగా నిర్ధేశించుకున్నాయి.