వచ్చే ఏడాది 5జీ సేవల ప్రారంభం 

వచ్చే ఏడాది 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. ఇందుకు అవసరమైన టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ  5జీ స్పెక్ట్రమ్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే ట్రయల్స్‌ నిర్వహించాలని భావిస్తున్నామని తెలిపారు. 

బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సంస్థ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ జియో ప్లాట్‌ఫామ్స్‌ 20కిపైగా స్టార్టప్‌లతో కలిసి 4జీ, 5జీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డివైజెస్‌, ఓఎస్‌, బిగ్‌డాటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆగమెంటెడ్‌ రియాలిటీ/వర్చువల్‌ రియాలిటీ, బ్లాక్‌చైన్‌, నాచురల్‌ లాంగ్వేజ్‌ అండర్‌స్టాండింగ్‌, కంప్యూటర్‌ విజన్‌ తదితర రంగాల్లో ప్రపంచస్థాయి టెక్నాలజీలను అభివృద్ధి చేశాయని ప్రకటించారు.

ఈ సాంకేతికతల సాయంతో మీడియా, ఆర్థిక సేవలు, వాణిజ్యం, విద్య, వైద్య, వ్యవసాయం, స్మార్ట్‌ సిటీలు, స్మార్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, మొబిలిటీ తదితర రంగాల్లో అద్భుతాలను సృష్టించేందుకు వీలుంటుందని తెలిపారు. 

దేశంలో డాటా వినియోగం భారీగా పెరిగిందని చెబుతూ  గత నెలలో జియో వినియోగదారులు 500 కోట్ల గిగాబైట్ల డాటాను ఉపయోగించుకొన్నారనిచెప్పారు. దేశంలో ఇప్పటివరకు దాదాపు 10 లక్షల ఇండ్లకు జియో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఇచ్చినట్టు వెల్లడించారు.

రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తి చూపుతున్నారని అంబాని తెలిపారు. త్వరలో అంతర్జాతీయ భాగస్వాములు, పెట్టుబడిదారులను ఈ విభాగంలో చేర్చుకోనున్నామని వెల్లడించారు.

“ఇప్పటికే మేము కిరాణా దుకాణదారులతో కలిసి నడుపుతున్న జియోమార్ట్‌ ఆన్‌లైన్‌ గ్రాసరీ ప్లాట్‌ఫామ్‌ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ఈ ప్లాట్‌ఫామ్‌కు నిత్యం 2.5 లక్షలకుపైగా ఆర్డర్లు వస్తున్నాయి. వీటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది” అని వివరించారు.

జియోమార్ట్‌తో అనుసంధానమైన రైతులు తమ తాజా వ్యవసాయోత్పత్తులను నేరుగా ప్రజల ఇండ్ల వద్దకే పంపిణీ చేస్తున్నారని పేర్కొంటూ అన్నదాతల ఆదాయం, వ్యవసాయ ఉత్పాదకత పెరిగేందుకు ఇది ఎంతో దోహదం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లలో మూడింట రెండొంతులు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయని, వీటిలో అమ్మే 80 శాతానికిపైగా కూరగాయలు, పండ్లను నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.  భాగస్వామ్య అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు రిలయన్స్‌ చమురు, రసాయనాల వ్యాపారాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా రూపొందించనున్నామని ప్రకటించారు. వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపారు.
చమురు, రసాయనాల వ్యాపారంలో 15 బిలియన్‌ డాలర్ల (రూ.1,12,655 కోట్ల) వాటాను సౌదీ అరేబియా సంస్థ ఆరామ్‌కోకు అమ్మాలని భావించామని, కానీ కరోనా సంక్షోభం వల్ల ఈ ఒప్పందం అనుకున్నంతగా ముందుకు సాగలేదని పేర్కొన్నారు.
 ప్రస్తుతం రవాణాకు ఉపయోగిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ లాంటి శిలాజ ఇంధనాల స్థానంలో విద్యుత్‌, హైడ్రోజన్‌ లాంటి కర్బనరహిత ఇంధనాలను తీసుకొస్తామని తెలిపారు. 2035 సంవత్సరం నాటికి కర్బన ఉద్గారరహిత సంస్థగా మారాలని రిలయన్స్‌ లక్ష్యంగా నిర్ణయించుకున్నదని ప్రకటించారు.
జియోమీట్‌ వీడియో కాలింగ్‌ యాప్‌నకు అద్భుత ఆదరణ లభిస్తున్నదని అంబాని తెలిపారు. భారత్‌లో క్లౌడ్‌ ఆధారిత తొలి వీడియో కాలింగ్‌ యాప్‌ ఇదే అని చెబుతూ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, విండోస్‌, మాక్‌ ఓఎస్‌, వెబ్‌ ఓఎస్‌లలో ఇది అందుబాటులో ఉన్నదని పేర్కొన్నారు. హైడెఫినిషన్‌ ఆడియో, వీడియో క్వాలిటీతో కాన్ఫరెన్స్‌లు నిర్వహించుకొనేందుకు వీలున్న ఈ యాప్‌ను ఒకేసారి 100 మంది నిరంతరాయంగా 24 గంటలూ ఉపయోగించుకోవచ్చని చెప్పారు.