రేప‌టి నుంచి విదేశీ విమాన స‌ర్వీసులు

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా నిలిచిపోయిన విదేశీ విమాన స‌ర్వీసులు మ‌ళ్లీ మొద‌లుకాబోతున్నాయి. దీనికి సంబంధించి మూడు దేశాల‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చాయ‌ని పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరీ తెలిపారు. 
 
అమెరికా, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీలతో జ‌రుపుతున్న సంప్ర‌దింపులు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నాయ‌ని చెప్పారు. అమెరికా రేప‌టి నుంచి, ఫ్రాన్స్ ఎల్లుండి నుంచి భార‌త్‌కు విమాన స‌ర్వీసులు న‌డిపేందుకు ఆ దేశాలు అంగీక‌రించాయ‌ని ఆయ‌న వివ‌రించారు. 
 
ఈ నెల 18 నుంచి ఆగ‌స్టు 1 వ‌ర‌కు పారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు మ‌ధ్య ఎయిర్ ఫ్రాన్స్ 28 విమానాల‌ను న‌డ‌ప‌నుంద‌ని వెల్ల‌డించారు. అలాగే ఈ నెల 17 నుంచి 31 వ‌ర‌కు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ భార‌త్ – అమెరికా మ‌ధ్య‌ 18 విమానాల‌ను న‌డుపేందుకు ఒప్పందం జ‌రిగింద‌ని తెలిపారు. 
 
 జ‌ర్మ‌నీతో కూడా విమాన స‌ర్వీసుల‌పై సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో కూడా ఒప్పందం ఓ కొలిక్కి వ‌చ్చింద‌ని చెప్పారు. అయితే విమాన స‌ర్వీసుల‌పై ఈ నిర్ణ‌యాన్ని ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మార్పులు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌ని పేర్కొన్నారు.