ప్రైవేట్‌ ఆస్పత్రుల గుర్తింపు రద్దు 

ప్రైవేట్‌ ఆస్పత్రుల గుర్తింపు రద్దు 

కోవిడ్‌ కేసు వస్తే ప్రైవేటు ఆస్పత్రులు వైద్యానికి నిరాకరించకూడదని, అలా నిరాకరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాలు జారీచేశారు. అవసరమైతే ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలని సూచించారు. 

రాష్ట్రంలో అవసరానికి తగ్గట్లు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు చెప్పిన వివరాలు విన్న తరువాత 17 వేలమంది డాక్టర్లు, 12 వేలమంది నర్సుల పోస్టుల భర్తీకి అనుమతిచ్చారు. సాధ్యమైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పారు. 

క్వారంటైన్‌ సెంటర్లలో భోజన సదుపాయం, పారిశుధ్యం సరిగా లేదంటూ వస్తున్న వార్తలపై ఆయన ఆరా తీశారు. అధికార యంత్రాంగం వాటిపై దృష్టి పెట్టాలని ని సూచించారు. రానున్న వారం రోజుల పాటు అధికారులు ఈ విషయమై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని, క్షేత్రస్థాయిలో అవసరమైన మంచి ప్రమాణాలు పాటించేందుకు అవసరమైన మార్పులను చేసుకోవాలని ఆదేశించారు. 

ఒకసారి కరోనా పాజిటివ్ సోకిన రోగికే మళ్లీ పాజిటివ్ వస్తే ఆ ఫలితాన్ని కొత్తదిగా ప్రకటించొద్దని సీఎం జ‌గ‌న్ సూచించారు.  కోవిడ్‌తో మరణించిన వారి అంత్యక్రియలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని సిఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలపై దృష్టిపెట్టాలని, జిఎంసి ప్రమాణాలున్న మందులనే చికిత్సకు అందించాలని తెలిపారు. 

కోవిడ్‌ పరీక్షలకు శాశ్వత కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అవి ఎక్కడ ఉన్నాయో తెలిపే విధంగా బోర్డులు పెట్టాలని ఆదేశించారు. ఎస్‌ఓపి ప్రకారం టెస్టులు చేయాలని, ఎవరికి చేయాలన్న అంశంపై స్పష్టమైన ప్రొటోకాల్‌ ఉండాలని, కేటగిరీని స్పష్టంగా పొందుపరచాలని తెలిపారు.