తెలుగు రాష్ట్రాల సరిహద్దులో కరోనా కలకలం  

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో మంగళవారం కరోనా కలకలం సృష్టించింది. గత వారం రోజుల్లో ముగ్గురు పాజిటివ్‌ ఉన్న వ్యక్తులు అశ్వరావుపేటకు చేరుకున్నారు. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైనే అధికారులు బ్లీచింగ్‌ చల్లి, సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేయిస్తున్నారు. 

ఏపీలోని పశ్చిమ గోదావరికి చెందిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌ నుంచి అశ్వరావుపేటకు చేరుకున్నారు. వీరిని గుర్తించిన అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం కొవిడ్‌-19 దవాఖానకు తరలించారు.

అలాగే జగ్గారెడ్డిగూడెంకు చెందిన పాజిటివ్‌గా గుర్తించిన ఓ వ్యక్తి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు అశ్వరావుపేట చేరుకుని చెక్‌పోస్ట్ వద్ద అనుమతి ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులు, వైద్యాధికారులకు వివరించారు. దీంతో అధికారులు అతన్ని అంబులెన్స్‌లో రాత్రి 11గంటలకు దవాఖానకు తరలించారు. 

అతను ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌ నుంచి అశ్వరావుపేటకు వచ్చాడు. అలాగే మంగళవారం మరో యువకుడు హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ బస్సులో సత్తుపల్లికి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో అశ్వరావుపేటకు వచ్చాడు. 

రింగ్‌రోడ్డులో దిగి పశ్చిమగోదావరి జిల్లాకు కాలినడకన బయలుదేరాడు. సరిహద్దు చెక్‌పోస్టులో అధికారులు ఆపి, వైద్య పరీక్షలు చేయగా, కొవిడ్‌-19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో దవాఖానకు తరలించారు. 

అలాగే మండలంలో నారావారి గూడెం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తించడంతో పోలీసులు దవాఖానకు పంపారు. ఈ ఘటనలతో మండల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.