రష్యా క‌రోనా వ్యాక్సిన్‌కు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తి

ప్రపంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిని నిర్మూలించ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. భార‌త్‌, అమెరికా, ర‌ష్యా, చైనా స‌హా ప‌లు దేశాలు క‌రోనాకు వ్యాక్సిన్‌ను త‌యారుచేసే ప‌నిలో బిజీగా ఉన్నాయి. 
 
ఈ మేర‌కు ఆయా దేశాల్లో ప‌రిశోధ‌న‌లు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. అయితే, మిగ‌తా దేశాల‌తో పోల్చితే ఈ విష‌యంలో ర‌ష్యా ఒక అడుగు ముందుకేసింది. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయ‌ని ర‌ష్యాలోని సెచెనోవ్ విశ్వవిద్యాలయం పేర్కొన్న‌ది. 
 
రష్యాకు చెందిన గమలీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ జూన్‌ 18న ప్రారంభమయ్యాయి. పరీక్ష లు చేపట్టిన తొలి బృందం వలంటీర్లు బుధవారం డిశ్చార్జి అవుతారని, రెండో బృందం ఈ నెల 20న డిశ్చార్జి అవుతుందని సెచెనోవ్ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ అండ్ బయో టెక్నాలజీ డైరెక్టర్ వాడిత్ తారాసోవ్ తెలిపారు. 
 
వ్యాక్సిన్ భద్రత నిర్ధారణ అయిందని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాక్సిన్‌ భద్రతకు అనుగుణంగా ఇది ఉంటుందని యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసిటమాలజీ, ట్రాపికల్, వెక్ట్ బోర్న్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషెవ్ పేర్కొన్నారు.