యుద్ధమే వస్తే చైనాను ఎదిరించే శక్తీ 

యుద్ధమే వస్తే చైనాను ఎదిరించే శక్తీ 
చైనా ప్రస్తుతం భారత్ తో గిల్లికజ్జాలు పెట్టుకోవడం మినహా భారత్ పై యుద్ధంపై దిగే పరిస్థితులలో లేదని మాజీ నావికాధికారి,  ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ డా. అలోక్ బన్సల్ స్పష్టం చేశారు. 
 
జమ్మూ కాశ్మీర్ స్టడీ సర్కిల్, హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన గూగుల్ సమావేశంలో “చైనా యుద్దాలు చేసే తీరు, ప్రభావం” అంశంపై మాట్లాడుతూ యుద్ధం అంటూ వచ్చినా భారత్ ను ఎదిరించే పరిస్థితులలో చైనా లేదని తేల్చిచెప్పారు. 
 
చైనాకు భారత్ కన్నా పెద్ద సైన్యం, అత్యాధునిక ఆయుధాలు ఉండడంతో పాటు అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ ఉన్నప్పటికీ వారికున్న పరిమితులు వారికి ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా భారత్ – ఛైనా సరిహద్దులలో నెలకొన్న పర్వత, లోయ వంటి ప్రదేశాలు వారికి యుద్ధంలో అంత అనుకూలం కాదని తెలిపారు. 
 
పైగా, చైనా సేనలు ఎక్కువగా జపాన్, వియత్నాం, రష్యా సరిహద్దులలో ఉన్నాయని; మన సరిహద్దులలో చాల తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అందుచేత సరిహద్దుల్లో భారత సేనలదే పై చెయ్యి కాగలదని చెప్పారు. 
 
ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో భారత నావికాదళం ఆధిపత్యం ఎక్కువని, చైనాకు సొంతగా పెద్దగా సముద్రమార్గం లేకపోవడంతో ఆ దేశపు సరుకు రవాణా, వాణిజ్యం అంతా ఎక్కువగా ఇటు వైపు నుండే జరుగవలసి ఉన్నదని చెప్పుకొచ్చారు. అందుచేత వారి మూలాలపై దాడులు చేయడం భారత్ నావికాదళానికి సులభం కాగలదని స్పష్టం చేశారు. 
 
చైనాకు 14 దేశాలతో సరిహద్దు వివాదాలు ఉంటె 12 దేశాలతో పరిష్కరించుకున్నదని, చాలా ఉదారంగా వివాదాస్పద భూభాగాలను ఆ దేశాలకు చాలావరకు గతంలోనే వదులుకున్నదని డా. బన్సల్ తెలిపారు. 
 
అయితే కేవలం భారత్ , భూటాన్ లతో మాత్రమే సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని చెబుతూ ప్రస్తుత పరిస్థితులలో ఈ సమస్యలు క్లిష్టంగా ఉండడంతో పరిష్కారం కావడం కష్టం కావచ్చని తెలిపారు. 
 
గతంలో చైనాతో సైద్ధాంతిక విబేధాలు భారత్ కు ఉండేవని, కానీ ఇప్పడు అటువంటి సమస్యలు లేవని, కేవలం క్లిష్టమైన సరిహద్దు సమస్యలు మాత్రమే నెలకొన్నాయని చెబుతూ భారత్ ను కట్టడి చేయడం కోసం చైనా ముఖ్యంగా రెండు కారణాలతో ప్రయత్నం చేస్తున్నదని ఆయన తెలిపారు. 
 
ఒకటి భారత్ ఎక్కడ అమెరికాతో భాగస్వామి అవుతుందో అనే భయం కాగా, మరొకటి భారత్ అంతర్జాతీయంగా ఆర్ధిక, సైనిక శక్తిగా ఎదగడంలో తమకు ఎక్కడ పోటీగా వస్తుందనే భయం అని వివరించారు. అందుల్లనే ముందుగా దక్షిణ ఆసియాలో అన్ని పొరుగుదేశాలతో చైనా భారత్ కు వ్యతిరేకంగా సంబంధాలు ఏర్పర్చుకొనే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. 
 
కాగా, చైనాలో ఓకే కుటుంబానికి ఒకే బిడ్డ అనే విధానం కారణంగా ఆ దేశంలో యువ జనాభా బాగా తగ్గి పోతున్నదని, అందుకనే సైన్యంలో కొత్తగా చేరే వారు ఎక్కువగా ఉండటం లేదని, దానితో వారిలో పోరాట పటిమ తగ్గుతున్నదని డా. బన్సల్ చెప్పుకొచ్చారు. కానీ భారత్ లో యువ జనాభా పెరుగుతున్నదని గుర్తు చేశారు. 
 
ఆర్ధికంగా, సైనికంగా చైనా ముందున్నా భారత్ బాగా వెనుకబడి లేదని స్పష్టం చేశారు. చైనాకు అత్యధికంగా విదేశీ మారకద్రవ్యం ఉండగా,  భారత్ ఇదో స్థానంలో ఉన్నదని తెలిపారు. మానవ వనరులలో మనం చాలా ముందున్నామని చెప్పుకొచ్చారు. 
 
భారత్ – చైనాల మధ్య వాణిజ్య లోటు గత రెండు సంవత్సరాలుగా తగ్గుతూ వస్తున్నదని చెబుతూ చైనా పెట్టుబడులను,  వస్తువులను పూర్తిగా బహిష్కరించాలని వాదన తొందరపాటు చర్య కాగలదని డా. బన్సల్ హెచ్చరించారు. 
 
స్వదేశీ ఉత్పత్తులను బలోపేతం చేసుకొనేవరకు చైనా నుండి నేరుగా దిగుమతులను వ్యతిరేకించినా మనదేశంలోని చైనా ఉత్పత్తులను వ్యతిరేకించవలసిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తంవేశారు. అదేవిధంగా మనదేశంలోని పరిశ్రమలలో చైనా పెట్టుబడులను సహితం వ్యతిరేకించ వలసిన అవసరం లేదని పేర్కొన్నారు.