91మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా  

91మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా  సోకిన్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. అయితేభక్తులెవరికీ వైరస్‌ సోకలేదని వివరించారు. జూలై 10వరకు తిరుమలలో 1865, అలిపిరి వద్ద 1704 మంది టీటీడీ ఉద్యోగులకు, 631 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.

లాక్‌డౌన్‌ తర్వాత 2.5లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు  చెప్పారు.  ఇప్పటి వరకు హుండీ ద్వారా రూ.16.73 కోట్ల ఆదాయం లభించిందని, 13.36 లక్షల లడ్డూలను విక్రయించామని ఈవో చెప్పారు. 

సప్తగిరి మాసపత్రికతో అన్యమతానికి చెందిన మరో పుస్తకం గుంటూరుకు చెందిన భక్తుడికి అందిన అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. వివాదాలకు తావులేకుండా టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రాన్ని సిద్ధం చేస్తున్నట్టు ఈవో తెలిపారు. 

శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వాహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. భక్తుల అనుమతి, ఇతర ఏర్పాట్లు వంటి విషయాలపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అయినప్పటికీ ఉత్సవాల కోసం టెండర్లు చేపడుతున్నట్టు చెప్పారు. 

శనివారం ఓ భక్తుడు 100గ్రాముల బరువున్న 20బంగారు బిస్కెట్లను హుండీలో సమర్పించినట్టు తెలిపారు. తలనీలాల ఈ వేలం ద్వారా రూ.37.23 కోట్ల ఆదాయం లభించిందని వివరించారు. తలనీలాల విలువ పెరగడంతో అదనంగా రూ.7కోట్లు సమకూరిందని తెలిపారు.