కరోనా కట్టడికి అందరూ కృషి   

కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగినప్పుడే కరోనా కట్టడి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. 

గురుగ్రామ్‌లోని ఖాదర్‌పూర్‌లో కేంద్ర సాయుధ పొలిసు దళాలు ఏర్పాటు చేసిన ‘ఆల్ ఇండియా ట్రీ ప్లాంటేషన్ క్యాంపెయిన్’లో  అమిత్ షా పాల్గొంటూ 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ లో కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు.

కరోనా కట్టడికి భద్రతా బలగాలు సైతం విశేష కృషి చేస్తున్నాయని ఆయన కొనియాడారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న యోధులకు తలవంచి వందనం చేస్తున్నానని ఆయన తెలిపారు. భద్రతా బలగాలు ఉగ్రవాదులతో పోరాడడమే కాదు ప్రజలకు సహకరిస్తూ కరోనా కట్టడికి కృషి చేయడం అభినందనీయమని ఆయన చెప్పారు. 

రోడ్ల మీదకు వచ్చినప్పుడు భౌతికదూరం పాటించడంతో పాటు విధిగా మాస్క్ ధరించాలని ఆయన దేశ ప్రజలకు సూచించారు. కరోనా కట్టడికి పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది పోలీసులకు ప్రజలు విధిగా సహకరించాలని ఆయన పేర్కొన్నారు.