పాక్షికంగానే వెనుకకు మళ్ళిన చైనా బలగాలు 

తూర్పు లడఖ్ సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు పాక్షికంగానే  వైదొలుగుతున్నట్టు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ప్యాంగాంగ్ సరస్సు, ఫింగర్4 ప్రాంతాల్లో చైనా బలగాలు కాస్త వెనక్కి వెళ్లాయి. కానీ, ఆ ప్రాంతంలో చైనా చేపట్టిన వందలాది నిర్మాణాలు, గుడారాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. 

ఉద్రిక్తతల పూర్వ స్థితికి(ఏప్రిల్ ముందునాటి స్థితికి) చైనా బలగాలు ఇంకా చేరుకోలేదని ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ప్యాంగాంగ్ సరస్సు పక్కన ఉన్న పర్వత ప్రాంతాన్ని 8 ఫింగర్లుగా భావిస్తారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) 8వ ఫింగర్ వద్ద అని భారత్ వాదిస్తుండగా, 4వ ఫింగర్ వద్ద అన్నది చైనా వాదిస్తున్నది. 

ఈ నేపథ్యంలోనే జూన్ 15న 4వ ఫింగర్ వద్ద ఇరు దేశాల మధ్య ఘర్షణ తలెత్తడం, భారత్‌కు చెందిన 20మంది జవాన్లు మరణించడం జరిగింది.

ఆ తర్వాత ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన పలు దఫాల చర్చల అనంతరం యథాతథ స్ధానాలకు బలగాలను వెనక్కి మళ్లించేందుకు అంగీకారం కుదిరిన విషయం తెలిసిందే. తాజాగా ఫింగర్4కు పది కిలోమీటర్ల దూరంలో చైనాకు చెందిన 11 పడవల్ని నిలిపి ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.