‘ప్రసాద్‌’లో రూ 30 లక్షల జీఎస్టీ మోసం 

హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్‌ మీడియా కార్పొరేషన్‌ జీఎస్టీ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సినిమా టిక్కెట్లపై పన్ను రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని ప్రేక్షకులకు దక్కకుండా నొక్కేసినట్లు జీఎస్టీ యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీ కనిపెట్టింది.
 
ఈ సంస్థ అక్రమంగా రూ.30.13 లక్షలకుపైగా లబ్ధి పొందినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ యాంటీ ప్రాఫిటీరింగ్‌ (డీజీఏపీ) దర్యాప్తులో తేలింది. టిక్కెట్లపై 18 శాతం కాకుండా 28 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో ఈ బాగోతం బయటపడింది. 
 
దర్యాప్తు నివేదికను జాతీయ యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీ (ఎన్‌ఏఏ) పరిశీలించగా, కనీస టిక్కెట్ల ధరలను సంస్థ పెంచినట్లు స్పష్టం చేసింది. 
 
‘జనవరి 1, 2019 నుంచి జూన్‌ 30, 2019 వరకు రూ.100కుపైగా ధర కలిగిన టిక్కెట్లపై జీఎస్టీ పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. అయినప్పటికీ ప్రసాద్‌ మీడియా కార్పొరేషన్‌ ఈ తగ్గింపును ప్రేక్షకులకు వర్తింపజేయలేదు. యథాతథంగా పాత ధరలకే టిక్కెట్లను విక్రయించారని మేము గుర్తించాం. దీనివల్ల అదనంగా రూ. 30,13,058 ఆదాయాన్ని పొందారు’ అని డీజీఏపీ తెలియజేసింది. 
 
కాగా, వస్తు రంగంలో ఇలాంటి మోసాలు చాలానే జరిగినా.. వినోద రంగంలో ఇదే తొలిసారి అని ఈవై ట్యాక్స్‌ పార్ట్‌నర్‌ అభిషేక్‌ జైన్‌ అన్నారు.