8 రాష్ట్రాల్లోనే 90 శాతం యాక్టివ్ కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఇప్ప‌టికే 7.67 ల‌క్ష‌ల‌కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు, 21 వేల‌కుపైగా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ మొత్తం యాక్టివ్ కేసుల‌లో కేవ‌లం ఎనిమిది రాష్ట్రాల నుంచే 90 శాతం ఉన్నాయి.

కేవ‌లం 49 జిల్లాల్లోనే 80 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కేవ‌లం ఆరు రాష్ట్రాల నుంచే 86 శాతం క‌రోనా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. 80 శాతం క‌రోనా మ‌ర‌ణాలు 32 జిల్లాల్లోనే న‌మోద‌య్యాయి. 

దేశ‌వ్యాప్తంగా ఉన్న మొత్తం క‌రోనా యాక్టివ్ కేసుల‌లో మ‌హారాష్ట్ర‌, తమిళ‌నాడు, ఢిల్లీ, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లోనే 90 శాతం ఉన్నాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశంలో న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల్లోనే 86 శాతం ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. 

ఢిల్లీలో జ‌రిగిన మంత్రుల బృందం 18వ స‌మావేశం అనంత‌రం కేంద్ర ఆరోగ్య మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ ఈ వివరాలు వెల్లడించారు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి మిలియ‌న్ మందికి 1453 మంది క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డితే దేశంలో మాత్రం ఆ సంఖ్య 538గా ఉంద‌ని ఆరోగ్య మంత్రి చెప్పారు.

మ‌ర‌ణాలు సైతం ప్ర‌పంచ స‌గ‌టుతో పోల్చితే భార‌త్‌లో త‌క్కువ‌గా న‌మోద‌య్యాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి మిలియ‌న్ మందికి 68.7 మంది క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలుకోల్పోతే దేశంలో మాత్రం ప్ర‌తి మిలియ‌న్ మందికి మ‌ర‌ణించిన క‌రోనా రోగుల సంఖ్య 15గా ఉంద‌ని చెప్పారు.

ఇలా ఉండగా, దేశంలో కరోనా వ్యాప్తిని అంచనా వేయడానికి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్మార్‌) మరోసారి దేశవ్యాప్త సర్వే నిర్వహించనుంది. ఐసీఎమ్మార్‌ మేలో నిర్వహించిన సర్వేకు ఇది కొనసాగింపు అనికేంద్ర ఆరోగ్యశాఖలో ప్రత్యేక అధికారి రాజేశ్‌ భూషణ్‌ చెప్పారు. అప్పుడు 83 జిల్లాలో ‘సీరో సర్వే’ నిర్వహించారు. అయితే ఆ సర్వే ఫలితాలను ఇంకా వెల్లడించలేదు.
 
సీరో సర్వేను రెండు దశల్లో నిర్వహిస్తామని ఐసీఎమ్మార్‌ ముందే చెప్పింది. మొదటి దశలో చిన్న చిన్న పట్టణాల్లో, వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. ప్రస్తుతం కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో, హాట్‌స్పాట్‌ నగరాల్లో సర్వే నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది.