ఎల్‌ఏసీని గౌరవించటంపైనే శాంతి సుస్థిరతలు

లఢక్‌లోని గల్వాన్‌ లోయ తమదేనన్న చైనా ప్రకటనను భారత్‌ మరోసారి తిరస్కరించింది. ప్రస్తుతం ఉన్న వాస్తవాధీన రేఖను గౌరవించి తీరాల్సిందేనని, ఎలాంటి మార్పులకు కూడా భారత్‌ అంగీకరించదని విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ  స్పష్టంచేశారు.
ఎల్‌ఏసీని గౌరవించటంపైనే ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు ఆధారపడి ఉంటాయని తేల్చి చెప్పారు. సరిహద్దులో బలగాల ఉపసంహరణకు శుక్రవారం మరోసారి భారత్‌, చైనా దౌత్య అధికారులు చర్చలు జరిపే అవకాశం ఉందని చెప్పారు.
కాగా లఢక్‌లోని గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్‌ నుంచి చైనా బలగాలు గురువారం పూర్తిగా వెనక్కు వెళ్లాయి. తూర్పు లఢక్‌లో మూడు ప్రాంతాల్లో ఇరుదేశాల సైనికులు వాస్తవాధీనరేఖ నుంచి మూడు కిలోమీటర్లు వెనక్కు వెళ్లి బఫర్‌జోన్‌ను ఏర్పాటుచేశారని అధికారవర్గాలు వెల్లడించాయి. ప్యాంగాంగ్‌ త్సోలోని ఫింగర్‌ 4 వద్ద కూడా బలగాలను తగ్గించారు.
మరోవైపు వాస్తవాధీన రేఖ వెంట బలగాల ఉపసంహరణ సమర్థంగా కొనసాగుతున్నదని చైనా ప్రకటించింది. ఉద్రిక్తత ఏర్పడిన అన్ని చోట్లా పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ తెలిపారు. సరిహద్దుల్లో సుస్థిర చర్యలకు భారత్‌ తమతో కలిసి పనిచేస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.