కరడుకట్టిన నేరగాడు, కాన్పూర్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. నిన్న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో వికాస్ దూబే పోలీసులకు చిక్కాడు. అక్కడి నుంచి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కాన్పూర్‌కు తరలిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున కాన్వాయ్‌లోని ఓ కారు బోల్తా పడింది.
ఇదే అదనుగా వికాస్ దూబే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే మృతిచెందాడు. మృతదేహాన్ని కాన్పూర్ దవాఖానకు తరలించారు. వికాస్ దూబే పోలీసు నుంచి తుపాకీ లాక్కోని పారిపోతుండగా తాము జరిపిన కాల్పుల్లో మరణించాడని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ చెప్పారు.
కారు బోల్తా పడగానే బయటకు వచ్చిన దూబే పోలీసు నుంచి పిస్టల్ లాక్కోని పారిపోయేందుకు యత్నించాడు. దూబే జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు గాయపడ్డారని కాన్పూర్ ఎస్పీ చెప్పారు. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు.
జూలై 2న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది పోలీసులను కాల్చిచంపి పరారీలో ఉన్న దూబే గ్యాంగ్‌లో ఇప్పటికే ఇద్దరు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. మరో నలుగురు పోలీసులకు పట్టుబడ్డారు.
మరోవంక, గ్యాంగ్‌స్టర్ దూబే తక్కువ కాలంలోనే కోట్లాదిరూపాయల ఆస్తులు సంపాదించాడని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో తక్కువ కాలంలో దూబే ఎలా కోట్లు గడించాడు అన్న దానిపై ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో దూబేను అరెస్టు చేయగానే, అతనితోపాటు అతని బంధువుల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను పోలీసులు సేకరించడం ప్రారంభించారు.
ఆదాయపుపన్నుశాఖ పరిశోధన విభాగం అధికారులు దూబే బినామీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. వికాస్ దూబే సన్నిహితుల పేరిట దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తోపాటు పలు దేశాల్లో ఆస్తులున్నాయని వెల్లడైంది. దూబే ఎనిమిది నెలల క్రితం లక్నోలో రూ.5 కోట్లు వెచ్చించి ఓ భవనం కొన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
దీంతోపాటు బ్యాంకాక్‌లోని ఓ హోటల్‌లో వికాస్ దూబే పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. వికాస్ దూబేకు 12 ఇండ్లు, 21 ఫ్లాట్లు ఉన్నాయని పోలీసులు ఇప్పటికే గుర్తించారు.దూబే సన్నిహితడి పేరిట ఆర్యనగర్ లో రూ 28 కోట్ల ఆస్తులున్నాయని తేలింది. ఆర్యనగర్‌లోనే దూబే మరో సన్నిహితుడి పేరిట 8 ఫ్లాట్లు ఉన్నాయని, వీటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని పోలీసులు తేల్చారు.
కాన్పూర్ నగరంలోని పంకీ ప్రాంతంలో దూబేకు డూప్లెక్స్ బంగళా ఉంది. దీని విలువ రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఐటీ అధికారులు దూబేతోపాటు అతని బంధువులు, సన్నిహిత అనుచరుల పేరిట ఉన్న ఆస్తుల గురించి కూడా సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
More Stories
16 నుంచి మూడు దేశాల పర్యటనకు ప్రధాని
దేశంలో అత్యంత శక్తివంతమైన నేతగా నరేంద్ర మోదీ
జార్ఖండ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు నేడే