కేరళలో గోల్డ్‌స్కాం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కుంభకోణంలో సీఎం పినరయి విజయన్‌ను విపక్షాలు లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నాయి. కీలక నిందితురాలు స్వప్న సురేష్‌ను సీఎం కాపాడుతున్నారంటూ ఎదురుదాడికి దిగాయి. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఆమెను అరెస్ట్ చేయడం కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఈ లోగా తాను నిర్దోషిని అంటూ ముందస్తు బెయిల్ కోసం ఆమె హైకోర్టు ను ఆశ్రయించింది. ఆమె ఎవ్వరో తనకు తెలియదని అనడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ విస్మయం వ్యక్తం చేశారు. వారిద్దరూ కలసి దిగిన అనేక ఫోటోలు, వీడియోలు మీడియాలో వస్తున్నాయని గుర్హ్టు చేశారు.
ఈ కుంభకోణంలో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ నిరసనలు వెల్లువెత్తడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు కేసు మొత్తం స్వప్న సురేష్ చుట్టూ సాగుతోంది. సీఎం విజయన్ వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ కాంగ్రెస్, బిజెపి యువజన విభాగాలు రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి.
ప్రతిపక్షాల ఆరోపణలు తీవ్రతరం కావడంతో ఈ సంఘటనపై కేంద్ర బృందాలతో దర్యాప్తు జరిపించమని కోరుతూ సీఎం విజయన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ వ్రాసారు. ఇప్పటికే సీఎం విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం.శివశంకర్ ను విధుల నుంచి తొలగించారు.
గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఊమెన్ చండీపై వచ్చిన `సోలార్ కుంభకోణం’తో దీనిని కేరళ మీడియా పోలుస్తూ కధనాలు ప్రచురిస్తున్నది. ఈ రెండు కుంభకోణాలలో సహితం ముఖ్యమంత్రి కార్యాలయంతో సాన్నిహిత సంబంధాలు గల మహిళలే ప్రధాన నిందితులు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి కార్యాలయం పట్ల ఇటువంటి ఆరోపణలు రావడం పట్ల సిపిఎం మిత్రపక్షం సిపిఐ సహితం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇటీవల దుబాయ్ నుంచి చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్‌సైన్‌మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య మార్గంలో తరలిన ఈ బంగారం పట్టుబడడం కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించి తిరువనంతపురంలోని యూఏఈ కాన్సలేట్ మాజీ ఉద్యోగి అయిన సరిత్ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో అటు యూఏఈ కూడా సీరియస్‌గా తీసుకుంది. భారత్‌కు సహకరించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది.
More Stories
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’