భారత్ లో కరోనా సామాజిక వ్యాప్తి లేదు 

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ భారత్‌లో ఇప్పటికైతే కరోనా సామాజిక వ్యాప్తి దశలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. సామాజిక వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటివరకూ సరైన నిర్వచనం ఇవ్వలేదని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ఓఎస్‌డీ రాజేష్ భూషణ్ తెలిపారు.
 
భారత్ బయోటెక్, క్యాడిలా హెల్త్‌కేర్ కరోనా వ్యాక్సిన్‌‌ను అభివృద్ధి చేస్తున్నాయని ఆయన చెప్పారు. డీసీజీఐ ఆమోదం అనంతరం రెండు వ్యాక్సిన్లకు సంబంధించి యానిమల్ టాక్సిసిటీ స్టడీస్‌ పూర్తయినట్లు వెల్లడించారు. 
 
ఈ రెండు వ్యాక్సిన్లను ఫేజ్ 1, ఫేజ్ 2 దశల్లో క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతించినట్లు ఆర్ భూషణ్ తెలిపారు. త్వరలో ట్రయల్స్ మొదలవుతాయని ఆయన స్పష్టం చేశారు.  
 
కాగా, దేశంలో కరోనా పాజిటివ్‌ రికవరీ కేసులు పెరుగుతున్నాయని చెబుతూ రికవరీ రేటు నిరంతరం పెరుగుతూ జూలై 9న 62.09 శాతానికి చేరుకుందని వివరించారు.