`కేసీఆర్ ఎక్కడ…’ ఓ యువకుడి మెరుపు ప్రదర్శన 

`కేసీఆర్ ఎక్కడ…’ ఓ యువకుడి మెరుపు ప్రదర్శన 

`కేసీఆర్ ఎక్కడ’ అంటూ ఓ యువకుడు భారీ భద్రత నడుమ ఉండే ప్రగతి భవన్ ఎదుట అకస్మాత్తుగా నిరసన ప్రదర్శన జరిపి మాయం కావడం తెలంగాణలో సంచలనం కలిగిస్తున్నది. గత 12 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎటువంటి అధికార కార్యక్రమాలలో పాల్గొనక పోవడంతో పలు ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్న నడుమ ఈ ప్రదర్శన కలకలం రేపింది. 

బుధవారం అకస్మాత్తుగా ఇద్దరు యువకులు అక్కడ మెరుపు నిరసనకు దిగారు. అక్కడున్న భద్రతా సిబ్బంది కోలుకొని లోపే వారు మాయం అయ్యారు. ప్రగతిభవన్‌ వద్దకు మోటార్‌ సైకిల్‌పై వెళ్లిన వారు.. ‘సిఎం కెసిఆర్‌ ఎక్కడీ.. ఆయన మా సిఎం.. కెసిఆర్‌ ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడం మా హక్కు…’ అంటూ ఇంగ్లీష్‌లో రాసున్న ఫ్లకార్డులను ప్రదర్శించారు.

ఈ ఘటన అనూహ్యంగా జరగడంతో ఆ యువకులను పోలీసులు పట్టుకోలేకపోయినట్టు తెలిసింది. యువకుల జాడను కనుక్కునేందుకు వారు స్థానిక సిసి కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

కేసీఆర్  గత నెల 28 తర్వాత అధికారికంగా ఎక్కడా కనిపించకపోవటంతో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు సోషల్‌ మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడుతున్నాయి. 

జులై మొదట్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి గ్రేటర్ హైదరాబాద్ లో మరో వారం రోజులపాటు లాక్ డౌన్ విధించే విషయమై నిర్ణయం తీసుకొంటామని స్వయంగా ఆయనే ప్రకటించారు. కానీ ఈ నెలలో ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి అధికారిక సమావేశాలను కూడా జరపనే లేదు. 

మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాల నిర్వహణ అనంతరం సిఎం ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గనలేదు. ఆ తర్వాత ఆయన నివాసమైన ప్రగతి భవన్లో దాదాపు నలభై మందికి కరోనా సోకిన్నట్లు కధనాలు వెలువడ్డాయి. 

ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా కెసిఆర్‌ ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ కొందరు హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ కూడా దాఖలు చేశారు. అలాగే ప్రతిపక్షాలు సిఎం ఆరోగ్యంపై హెల్త్‌బులిటెన్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశాయి. 

కాగా, కీలకమైన అంశాలపై మాట్లాడేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి,  నిఘా ఆఫీసర్లను ఫాంహౌజ్ కు పిలిచి కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫాంహౌజ్ లో ఓ హాల్ ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నది. సచివాలయం భవనాల కూల్చివేత ప్రారంభంకు ముందు రోజు సీఎస్, డీజీపీ దాదాపు పది గంటల పాటు సీఎంతో ఫాంహౌజ్ లో  జరిగిన సమావేశంలో పాల్గొన్నట్టు తెలిసింది.

 అత్యవసరమైన ఫైల్స్ పై సంతకం కోసం అధికారులు ఫాంహౌజ్ కే వెళ్తున్నారు. మిగతా ఫైళ్లను చూడటం అధికార  వర్గాలు పేర్కొంటున్నాయి. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచీ వందలాది ఫైళ్లు సీఎం ఆఫీసులోనే ఆగిపోయాయని చెబుతున్నారు.