ఏపీ ఆరోగ్యశ్రీ లోకి కరోనా చికిత్స 

కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్.జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.  కోవిడ్‌ బాధితులకు ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందుతుండగా ఇకపై ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ దీనితో చికిత్స లభిస్తుంది. 

కరోనా చికిత్సకు అయ్యే ఖర్చుల వివరాలను కూడా ప్రకటించారు. ప్రైవేటు ఆస్ప‌త్రులు ఆయా ఫీజుల‌కు మించి వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని ఉత్త‌ర్వుల్లో స్పష్టం చేశారు. నాన్‌ క్రిటికల్‌ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకి రూ.3,250, క్రిటికల్‌ కోవిడ్‌-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్‌ఐవీ లేకుండా ఉంచితే రోజుకి రూ.5,480 చొప్పున ఫీజుగా నిర్ధారించిన‌ట్లు తెలిపారు. 

ఎన్‌ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ.5,980, వెంటిలేటర్‌ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.9,580కి మించి చార్జ్ చేయ‌కూడ‌ద‌ని చెప్పారు. ఇన్ఫెక్షన్‌ ఉన్న వారికి వెంటిలేటర్‌ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ.6,280, ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380 ఫీజు వసూలు చేయ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. 

ఆరోగ్య శ్రీ నెట్‌వ‌ర్క్ ప‌రిధిలోని ఆస్ప‌త్రుల‌న్నీ ఇవే ఫీజులు వ‌సూలు చేయాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేశారు. వాటి మేర‌కు ప్ర‌భుత్వ‌మే ఆరోగ్య శ్రీ కింద చికిత్స  పొందిన వారికి రీయింబ‌ర్స్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. పేద ప్ర‌జ‌లెవ‌రైనా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో ఎక్క‌డైనా ఉచితంగా క‌రోనా చికిత్స పొంద‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు.

కాగా, ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా సోకిన వారితో పాటు కాంటాక్ట్ అయిన వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇలా ఉండగా, కరోనా నేపథ్యంలో 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల అనంతరం స్పెషల్‌ జైలుకు తరలించే విధంగా ఆదేశాలు జారీచేసింది.