కువైట్‌లో 8 లక్షల భారతీయుల ఉపాధికి దెబ్బ!

కువైట్‌లో ఉపాధి పొందుతున్న సుమారు 8 లక్షల మంది  భారతీయులపై దెబ్బ పడనుంది. తాజాగా ఆ దేశానికి చెందిన జాతీయ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం వారిని  నిరుద్యోగులుగా మార్చే ప్రమాదం ఏర్పడింది. కువైట్‌లో విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించుకునే ముసాయిదాకు ఆ దేశ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 
 
ప్రస్తుతం ఈ బిల్లును సంబంధిత కమిటీ పరిశీలనకు పంపారు. అక్కడ సమగ్ర ప్రణాళిక రూపొందిస్తారు. ఇతర దేశస్తులకు కోటాను నిర్ణయిస్తారు. ఈ ముసాయిదా చట్టరూపం దాలిస్తే క్రమక్రమంగా కువైట్‌లో విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గిస్తారు.

ఈ బిల్లు ప్రకారం, కువైట్‌ జనాభాలో భారతీయుల సంఖ్య 15 శాతానికి మించి ఉండకూడదు. దీని ఫలితంగా సుమారు 8 లక్షల మంది భారతీయులు వెనక్కి వెళ్లవలసి ఉంటుంది. కువైట్‌ ప్రస్తుత జనాభా 43 లక్షలు కాగా, విదేశీయులు 30 లక్షలు మంది ఉన్నారు. వీరిలో 14 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా.
 
ఆయిల్‌ ధరలు దిగజారడం, కరోనా వైరస్‌ విజృంభణ వంటి కారణాలతో విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించాలని కువైట్‌ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కువైట్‌లో 49 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. జనాభాలో 70 శాతంగా ఉన్న విదేశీయులను 30 శాతానికి తగ్గించాలని గత నెలలో కువైట్‌ ప్రధాని షేక్‌ సబా అల్‌-ఖలీద్‌ అల్‌ సబా బిల్లు ప్రవేశపెట్టారు. 
 
కాగా, సుమారు 30 లక్షల మంది ఉన్న విదేశీయులు నిరక్ష్యరాసులు లేదా నామమాత్రంగా చదవడం, రాయడం వచ్చిన వారని అసెంబ్లీ స్పీకర్‌ మరజ్‌క్యూ అల్‌ ఘనెమ్‌ పేర్కొనట్లు కువైట్‌ టైమ్స్‌ తెలిపింది. వీరు నిజంగా కువైట్‌కు అవసరం లేదని స్పీకర్‌ చెప్పినట్లు పేర్కొంది. 
 
‘మనం డాక్టర్లు, నైపుణ్యం ఉన్న కార్మికులను మాత్రమే నియంచుకోవాలి. నైపుణ్యం లేని వాళ్లను కాదని అర్థం చేసుకోవాలి. విదేశీ కార్మికులు సంఖ్యను పెంచడంలో వీసా వ్యాపారులు దోహదపడ్డారు’ అని స్పీకర్‌ పేర్కొన్నారు. దేశంలో క్రమక్రమంగా విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 70 శాతం ఉన్న విదేశీయలు, వచ్చే ఏడాదికి 65 శాతం తగ్గుతారని చెప్పారు.

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం 28 వేల భారతీయులు కువైట్‌లో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. నర్సులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా వీరు పని చేస్తున్నారు. 5.23 లక్షల మంది భారతీయులు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నారు. 1.16 లక్షల మంది ఆధారపడినవారు. 60 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. 
 
చెల్లింపుల విషయంలో భారత్‌కు కువైట్‌ ప్రధాన వనరు. 2018లో భారత్‌ కువైట్‌ నుంచి 4.8 బిలియన్‌ డాలర్ల చెల్లింపులను అందుకుంది. దేశంలో కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువగా కువైట్‌కు ఉద్యోగాల నిమిత్తం వెళుతుంటారు. వీరిలో ఎక్కువ మంది నైపుణ్యం లేని కార్మికులే. 
ఇప్పటికే భారత దేశంలో కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. పట్టణాల్లో ఉపాధి లేక జనం పల్లెటూళ్లుకు తిరిగి వస్తున్నారు. ఊళ్లల్లో వీరికే ఉపాధి లభించడం లేదు. వీరికి కువైట్‌ నుంచి తిరిగివచ్చేవారు తోడైతే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది.