వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో నిందితుడైన తెలుగుదేశం పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొల్లు రవీంద్రను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తనను అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన తన స్వస్థలమైన మచిలీపట్నం నుంచి విశాఖ వైపు వెళ్తూ పోలీసులకు చిక్కారు.
గత నెల 29వ తేదీన మచిలీపట్నం చేపల మార్కెట్‌లో జరిగిన మోకా భాస్కరరావు హత్యకేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై నాలుగో నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లు గప్పి పరారవుతూ తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని సీతారామపురం వద్ద పోలీసులకు రవీంద్ర చిక్కారు.
కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే భాస్కరరావు హత్య జరిగిందని మోకా బంధువులు ఆర్‌పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హత్యకు పాల్పడిన ముగ్గురితో పాటు కొల్లు రవీంద్రపైన 302, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మోకా హత్యకేసులో ఇప్పటికే ప్రధాన నిందితులైన చిన్నీ, నాంచారయ్య, కిషోర్‌లతో పాటు వారికి సహకరించిన నాగమల్లేశ్వరరావు, వంశీలను అరెస్ట్ చేశారు.
కాగా, ప్రాథమిక విచారణ కూడా చేయకుండా అరెస్ట్ చేయడం వైసీపీ కక్ష సాధింపునకు నిదర్శనమని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. దురుద్దేశపూర్వకంగా.. కావాలనే ఈ కేసులో రవీంద్రను ఇరికించారని, బీసీలంటేనే వైసీపీ పగబట్టిందని మండిపడ్డారు. ప్రతీకారేచ్ఛతో చేస్తున్న అరెస్ట్‌లను అందరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.
More Stories
ఏడాదిలోగా గన్నవరంలో ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్
కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్
కూటమి ప్రభుత్వ సారధ్యంలో ఏపీ అభివృద్ధి ఖాయం