
కరోనా మహమ్మారి వ్యాప్తి సంబంధించి భారత దేశంలో జూన్ నెల శరాఘాతంగా మారింది. ఈ నెలలో కరోనా కేసులు రెట్టింపు కాగా, మరణాలు మూడు రేట్లకు పైగా పెరిగాయి.జూన్ 1 నాటికి దేశంలో 1,90,535 పాజిటివ్ కేసులు నమోదు కాగా, జూన్ చివరి నాటికి ఈ సంఖ్య 5.85 లక్షలకు చేరింది.
జూన్ నెలలోనే 3,94,958 కేసులు నమోదు కావడం గమనార్హం. మరణాల సంఖ్య జూన్ 1న 5,394గా ఉండగా, జూన్ 30నాటికి 17వేలు దాటింది. ఈ నెలరోజుల సమయంలోనే దేశంలో 12వేల మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
పది రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,74,761 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీరిలో 7,855 మంది ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులోనూ కేసుల సంఖ్య 90వేలు దాటింది. వీరిలో 1,201మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసుల సంఖ్య 87,360కి చేరగా 2,742 మంది చనిపోయారు. గుజరాత్‌లోనూ కరోనా మరణాల సంఖ్య 1,846కి చేరింది.
తాజాగా గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 18,653 పాజిటివ్ కేసులు, 507 మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ బయటపడిన నుంచి ఒక్కరోజులో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. దీంతో బుధవారం నాటికి దేశంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 5,85,493కి చేరింది.
More Stories
రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు తప్పదా!
నకిలీ వార్తలు సమాజానికి ప్రమాదకరం
అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం