కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడినపడుతోంది. లాక్‌డౌన్ సడలింపులు పెరిగి అన్‌లాక్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలన్ని పట్టాలెక్కడంతో ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటోంది. గడిచిన మూడు నెలల్లో చూస్తే జూన్‌కు సంబంధించిన జీఎస్టీ రెవెన్యూ భారీగా మెరుగుపడింది.
జూన్‌లో రూ.90,917 కోట్ల మొత్తం వస్తు, సేవల పన్ను రూపంలో ప్రభుత్వం చేతికి వచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీ రూ. 99,939 కోట్లు. అంటే ఈ ఏడాది జూన్‌లో 9 శాతం మాత్రమే జీఎస్టీ రాబడి తగ్గింది. ఓ వైపు కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతున్నప్పటికీ ఈ స్థాయిలో పన్ను వసూలు కావడం రికార్డేనని భావిస్తున్నారు.
ఈ నెలలో వచ్చిన మొత్తం జీఎస్టీలో సీజీఎస్టీ వాటా రూ.18,980 కోట్లు, ఎస్‌జీఎస్టీ వాటా రూ.23,970 కోట్లు ఉంది. ఐజీఎస్టీ రూ.40,302 కోట్లు ఉంది. దీనిలో దిగుమతులపై వసూలు చేసిన పన్ను రూ.15,709 కోట్లు. ఇక సెస్ రూపంలో మరో 7,655 కోట్లు వసూలైంది.
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కఠినంగా లాక్ డౌన్ అమలు చేయడంతో ఆర్థిక సంవత్సరం మొదలైన తొలి నెల ఏప్రిల్‌లో ఆర్ధిక వ్యవస్థకు గడ్డుకాలం నడిచింది. జీఎస్టీ వసూలు ఘోరంగా పడిపోయింది. ఆ నెలలో కేవలం రూ.32,,294 కోట్లు మాత్రమే వస్తు, సేవల పన్ను రూపంలో ప్రభుత్వానికి రాబడి వచ్చింది. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీలో ఈ మొత్తంలో 72 శాతం తక్కువ.
ఇక మే నెలలో రూ 62,009 కోట్ల జీఎస్టీ వసూలైంది. 2019 మే నెలలో వసూలైన జీఎస్టీ సుమారు లక్ష కోట్ల రూపాయలు. అంటే ఈ ఏడాది 38 శాతం క్షీణత కనిపించింది. అయితే జూన్‌లో కరోనా లాక్ డౌన్ ఆంక్షల్లో భారీగా సడలింపులు, అన్‌లాక్ దశలోకి రావడంతో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకున్నాయి.
దీంతో ముందు రెండు నెలల కన్నా జూన్‌లో జీఎస్టీ రాబడి బాగా పెరరిగింది. అలాగే గత మూడు నెలలుగా జీఎస్టీ రిలాక్సేషన్ పొందిన వ్యాపారులు కూడా జూన్‌లో ఫైలింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సగటున ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఎస్టీ రెవెన్యూ గత ఏడాది ఫస్ట్ క్వార్టర్‌తో పోలిస్తే 41 శాతం పడిపోయింది.
More Stories
సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో అండర్‌వరల్డ్ హస్తం లేదు!
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
ముడా స్కామ్‌లోరూ. 300 కోట్ల ఆస్తుల జప్తు