ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాతో అన్ని రంగాల్లో తెగదెంపులు చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్(ఎంటీఎన్‌ఎల్) మార్చిలో జారీచేసిన 4జీ అప్‌గ్రేడేషన్ టెండర్‌ను బుధవారం రద్దు చేశాయి.
అప్‌గ్రేడేషన్ ప్రక్రియ కోసం సరికొత్త స్పెసిఫికేషన్లను జారీ చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్(డీఓటీ) నిర్ణయించిన తర్వాత ఈ రెండు ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్ సర్వీసు ప్రొవైడర్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి.
కాగా, దీని స్థానంలో కొత్త టెండర్ జారీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కొత్త టెండర్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియ కోసం చైనా నుంచి పరికరాలను తీసుకోవద్దని భావిస్తున్నారు.
గల్వాన్ వ్యాలీ ఘటన నేపథ్యంలో 4జీ అప్‌గ్రేడేషన్‌లో చైనా పరికరాలను ఉపయోగించవద్దని బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను డీఓటీ కోరింది. అలాగే, ఈ మేరకు ప్రైవేట్ టెలీకమ్యూనికేషన్ కంపెనీలను కూడా డీఓటీ కోరనుంది.
ఇదిలా ఉండగా, ఈ టెండర్ల రద్దు మొబైల్ సాంకేతిక దిగ్గజాలు హువావే, జడ్‌టీఈ సంస్థలపై భారీ ప్రభావం చూపనుంది. ఇదిలా ఉండగా, ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌పై ఒక ప్రాజెక్ట్ కోసం బీజింగ్ నేషనల్ రైల్వే ఆర్ అండ్ డీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్‌కు ఇచ్చిన రూ .1471 కోట్ల ఒప్పందాన్ని జూన్ మధ్యలో భారత రైల్వే రద్దు చేసింది.
మరోవంక, దేశంలో చేపడుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను కానీ, ఆ దేశ కంపెనీల భాగస్వామ్యాన్ని కానీ అనుమతించేది లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈ కంపెనీల్లో కూడా చైనాను అనుమతించబోమని ప్రకటించారు. చైనా కంపెనీలు భాగస్వామిగా ఉన్న జాయింట్ వెంచర్లను కూడా అనుమతించబోమని తేల్చిచెప్పారు.
జాతీయ రహదారులకు సంబంధించి కొత్త పాలసీని తీసుకొస్తున్నామని చెబుతూ మన దేశ కంపెనీలకు ప్రాజెక్టు నిర్మాణాల్లో ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పిస్తామని గడ్కరీ వెల్లడించాయిరు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో చైనా కంపెనీల భాగస్వామ్యం ఉన్నట్టైతే రీబిడ్డింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
సాంకేతిక, ఆర్థిక నిబంధనలను దేశీయ సంస్థల కోసం సడలించాలని జాతీయ రహదారుల సెక్రటరీ గిరిధర్, చైర్మన్ సంధూలకు సూచించానని చెబుతూ త్వరలోనే దీనిపై సమావేశాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు. మన దేశానికి విదేశీ టెక్నాలజీ అవసరమైనా కూడా చైనా పెట్టుబడిదారులను అనుమతించబోమని గడ్కరీ స్పష్టం చేశారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు