సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశీయ కంపెనీలకు సిరులు కురిపిస్తున్నది. చైనాకు చెందిన టిక్‌టాక్, హేలో, వీగో వంటి వీడియో యాప్స్‌పై నిషేధం విధించడంతో వాటిని పోలిన స్వదేశీ యాప్స్‌కు రాత్రికి రాత్రే భారీగా డిమాండ్ పెరిగింది. నిన్నటిదాకా టిక్‌టాక్, హేలో యాప్స్‌ను ఉపయోగించిన వినియోగదారులు ‘రొపోసో ’, ‘చింగారీ’, ‘ట్రెల్’ వంటి దేశీయ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయం వెలువడిన 12 గంటల్లోనే తమ యాప్‌ను కోటిమందికిపైగా భారతీయులు డౌన్‌లోడ్ చేసుకున్నారని ‘రొపోసో’ యాప్ సహవ్యవస్థాపకుడు మయాంక్ భంగాడియా తెలిపారు. చైనా యాప్‌లపై నిషేధానికి ముందు రొపొసోను 6.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని, ఇప్పుడు వారి సంఖ్య 10 కోట్లను దాటిందని చెప్పారు. దాదాపు ప్రతి గంటకు ఆరు లక్షలమంది వినియోగదారులు కొత్తగా తమ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని వివరించారు.
చాలా తక్కువమందికి తెలిసిన ‘ట్రెల్’ యాప్‌కు కూడా తాజాగా డిమాండ్ పెరిగినట్టు ట్రెల్‌కు చెందిన గూగుల్‌ప్లే పేజ్ తెలిపింది. ట్రెల్‌ను ఇప్పటికే 10 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్టు ఆ పేజ్ వెల్లడించింది. ఈ యాప్ సామ్‌సంగ్ గెలాక్సీ, షియామీ ఎంఐ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంది.
మునుపెన్నడూలేని రీతిలో మొబైల్ యూజర్లు తమ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని చింగారీ యాప్ నిర్వాహకులు చెప్పారు. సగటున గంటకు 80వేల మంది చొప్పున తమ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని, ఇప్పటికే తమ వినియోగదారుల సంఖ్య 35 లక్షలు దాటిందని యాప్ సహవ్యవస్థాపకుడు, చీఫ్ ప్రాడక్ట్ అధికారి సుమీత్ ఘోష్ చెప్పారు.
తమ యాప్ వేదికగా వినియోగదారులు ప్రతి అరగంటకు 2.21లక్షల వీడియోలను చూస్తున్నారని తెలిపారు. రొపోసో చాలారోజులుగా అందుబాటులో ఉండగా, చింగారీ రెండు రోజుల్లోనే వైరల్‌గా మారింది.
లఘు వీడియోల రూపకల్పనకు ఉపయోగపడే మరో ‘బోలో ఇండ్యా’ను కూడా 12 గంటల్లోనే లక్ష మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్టు తెలిసింది. ఈ యాప్ గూగుల్ ప్లే, యాపిల్ యాప్‌స్టోర్‌తోపాటు ఒప్పొ, వీవో స్మార్ట్‌ఫోన్లకు చెందిన యాప్‌స్టోర్స్‌లో లభ్యమవుతున్నది.
వీడియో కాన్ఫరెన్స్ : వర్చువల్ క్లాసెస్, ఆఫీస్ మీటింగ్స్ అన్నింటికీ జూమ్ యాప్‌నే వాడుతున్నారు. ఈ యాప్‌ను నిషేధించకపోయినా దీనికి పోటీగా గూగుల్ మీట్, స్కైప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ డుయో, వాట్సాప్ కాల్, సే నమస్తే వంటి యాప్స్ వాడుకోవచ్చు.
బ్రౌజింగ్ : బ్రౌజింగ్ అనగానే యూసీ బ్రౌజర్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఇది లేదు కాబట్టి దానికి బదులు గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా వంటివి వాడొచ్చు.
స్కాన్ : ఫొటోలు, ఫైళ్లను స్కాన్ చేసేందుకు ఇప్పుడు డాక్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్, డాక్యుమెంట్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్, అడోబ్ స్కాన్, ఫొటో స్కాన్ బై గూగుల్, మైక్రోసాఫ్ట్ లెన్స్ వంటి యాప్స్ వాడొచ్చు.
ఆఫీస్ వర్క్ : వర్డ్ ఎక్సెల్ షీట్ల వంటి వాటి కోసం మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఓన్లీ ఆఫీస్ వంటివి వాడొచ్చు.
సెక్యూరిటీ : మొబైల్‌లో వైరస్ చేరకుండా అవాస్తా, ఏవీజీ, నార్తన్ యాంటీ వైరస్ వంటి యాప్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి.
రెండు అకౌంట్లు : ఒకే ఫోన్‌లో రెండు వేర్వేరు అకౌంట్లతో యాప్‌లను వాడాలంటే క్లోన్ యాప్, సూపర్ క్లోన్ వంటివి యాప్స్ ఉపయోగపడుతున్నాయి.
మొబైల్ లాక్ : లాక్ యాప్ – స్మార్ట్ యాప్ లాకర్, లాక్ యాప్ – ఫింగర్ ప్రింట్, కీప్ సేఫ్, నొర్టన్ యాప్ లాక్, లాక్ మై పిక్స్ సీక్రెట్ ఫొటో వాల్ట్ వంటివి వాడొచ్చు.
ఫోటో ఎడిటింగ్ : అడోబ్ ఫొటోషాప్, గూగుల్ స్నాప్‌సీడ్, పిక్స్ ఆర్ట్, లైట్ రూమ్, బీ612 వంటి వాటితో చక్కగా ఫొటోలు ఎడిటింగ్ చేసుకోవచ్చు.
టైపింగ్ : ఇండిక్ కీబోర్డు , జీ బోర్డ్, గింగర్ కీబోర్డు, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ కీబోర్డు వంటివి వాడొచ్చు.
వీడియో ఎడిటింగ్ : వీడియోలను ఎడిట్ చెయ్యడానికి చాలానే ఆప్షన్లున్నాయి. అడోబ్ ప్రీమియర్ క్లిప్, మ్యాజిస్టో, కైన్ మాస్టర్ యాప్స్ బాగా ఉపయోగపడతాయి.
యాక్టివిటీస్ : టిక్‌టాక్ బదులుగా రోపోసో, డబ్ స్మాష్, పెరిస్కోప్, యూట్యూబ్ లాంటి వాటిని వాడొచ్చు.
ఫైల్స్ షేరింగ్ : షేరిట్ బదులుగా షేర్ ఫైల్స్, ఫైల్స్ బై, జీ షేర్ వంటి యాప్స్ వాడొచ్చు
More Stories
అమెరికన్లకు ఇక స్వర్ణయుగమే
తెలుగు వారి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు
ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం