జీఎస్డీపీపై కరోనా లాక్‌డౌన్‌  ప్రభావం 

కరోనా లాక్‌డౌన్‌ వల్ల దేశంలో ఆర్థిక కార్యకలాపాలపై తీవ్రమైన ప్రభావం పడిందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ తేల్చింది. దీని ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రాష్ట్రాల జీఎస్డీపీ (స్థూల రాష్ట్రీయోత్పత్తి) -1.4 నుంచి -14.3 శాతం మేరకు క్షీణించవచ్చని అంచనా వేసింది.
 
అసోం, గోవా, గుజరాత్‌, సిక్కిం లాంటి రాష్ట్రాల్లో వృద్ధిరేటు క్షీణత రెండంకెల్లో నమోదు కావచ్చని తెలిపింది. లాక్‌డౌన్‌ ప్రభావం కర్ణాటక, జార్ఖండ్‌, తమిళనాడు, కేరళ, ఒడిశాలపై అధికంగా.. మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ లపై తక్కువగా ఉన్నట్టు సోమవారం విడుదల చేసిన నివేదికలో ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ పేర్కొన్నది. 
 
ఏపీ జీడీపీ -1.4 శాతంగా, తెలంగాణ జీడీపీ -3.2 శాతంగా ఉండొచ్చని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలపై లాక్‌డౌన్‌ ప్రభావం భిన్నంగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడని రాష్ట్రాలతో పోలిస్తే వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో వ్యవసాయ కార్యకలాపాలు తక్కువగా ప్రభావితమైనట్టు తెలిపింది. 
 
బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగాలపై కూడా లాక్‌డౌన్‌ ప్రభావం తక్కువగానే ఉన్నదని అభిప్రాయపడింది. ఈ రంగాల్లో డిజిటల్‌ సాంకేతికతతో కార్యకలాపాలు సాగించేందుకు ఎక్కువ అవకాశాలు ఉండటమే కారణమన్నది. 
 
పన్నుల ద్వారా రాష్ట్రాలకు వచ్చే ఆదాయానికి లాక్‌డౌన్‌ భారీగా గండికొట్టినట్టు ఇండియా రేటింగ్స్‌ పేర్కొన్నది. మున్ముందు ఇది మరింత పెరుగవచ్చని తెలిపింది. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కేరళ, తెలంగాణ, హర్యానాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గవచ్చని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది.