పీపీఈ కిట్స్‌ ఎగుమతికి కేంద్రం అనుమతి  

స్వదేశీ పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌) కిట్స్‌ ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.  నెలలో 50 లక్షల వరకు ఎక్స్‌పోర్ట్‌ చేయవచ్చని పేర్కొంది. ఎక్స్‌పోర్ట్‌ లైసెన్స్‌ పొందేందుకు దరఖాస్తుదారులకు గల అర్హతా ప్రమాణాలను పొందుపరుస్తూ త్వరలోనే ట్రేడ్‌ నోటీసు జారీ చేస్తామని పేర్కొంది.
కొవిడ్ -19 యుద్ధంలో విజయం సాధించడమే కాకుండా.. ప్రపంచ శక్తిగా ఎదగగల సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెబుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనప్పుడు దేశంలో పీపీఈ కిట్ల తయారీ లేదు. కానీ ఇప్పుడు అవసరానికంటే ఎక్కువ మొత్తంలో తయారవుతున్నాయి.
తయారీదారులు వీటిని ఎగుమతి చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఇదిలా ఉండగా, మన పీపీఈ కిట్ల కోసం అమెరికా,  కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌, ఐరోపా దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెబినార్‌లో తెలిపారు.
అలాగే, అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) ప్రకారం, పీపీఈల కోసం ప్రపంచ మార్కెట్ పరిమాణం వచ్చే ఐదేళ్లలో 60 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీఈ కిట్ల తయారీ సామర్థ్యాన్ని మోదీ ప్రభుత్వం పెంచింది.  దేశంలో ప్రస్తుతం రోజుకు ఆరు లక్షల కిట్లు ఉత్పత్తి అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.