మరో నెల రోజుల్లో రాఫెల్‌ జెట్ ఫైటర్లు

మరో నెల రోజుల్లో రాఫెల్‌ జెట్ ఫైటర్లు
చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అనుకున్నదానికన్నా ముందే రాఫెల్‌ జెట్ ఫైటర్లు భారత వాయుసేన అమ్ములపొదలోకి చేరనున్నాయి. తొలి దశలో భాగంగా ఆరు జెట్‌ ఫైటర్లు వచ్చే నెల చివరికల్లా అంబాలాలోని వైమానిక స్థావరానికి చేరే అవకాశాలు ఉన్నాయి. భారత వైమానిక దళం అభ్యర్థన మేరకు రాఫెల్‌ జెట్‌ఫైటర్ల డెలివరీలను వేగవంతం చేస్తున్నట్టు ఫ్రాన్స్‌లోని కంపెనీకి  చెందిన ఒక అజ్ఞాతవ్యక్తి వెల్లడించారు.
లడఖ్ సెక్టార్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) వెంట భారత్ ప్రస్తుతం చైనాతో స్టాండ్-ఆఫ్‌లో ఉంది. సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉండటంతో తమతో చేసుకొన్న ఒప్పందంలో భాగంగా తొలి విడుత రాఫెల్‌ జెట్‌ ఫైటర్లను జూలై నెలలో అందించాలని భారత్‌ వైమానికదళం ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది.
ఆ మేరకు తొలి విడుతలో ఆరు రాఫెల్ యుద్ధ విమానాలను జూలై 27 కల్లా అంబాలాలోని వైమానిక స్థావరంలో దించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. వైమానిక దళం సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు 36 రాఫెల్‌ జెట్‌ విమానాలనుకొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం 2016 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో రూ.59,000 కోట్ల విలువైన ఒప్పందం చేసుకొన్నది.
విమాన తయారీదారు డసాల్ట్ ఏవియేషన్ మెరిగ్నాక్ వద్ద సుమారు 10 రాఫెల్ జెట్‌లు సిద్ధంగా ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబికి సమీపంలో ఉన్న అల్ ధఫ్రా వైమానిక స్థావరం నుంచి ఆరు రాఫెల్‌ యుద్ధవిమానాలను జూలై చివరిలో భారత్‌కు పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
భారత వైమానికదళానికి చెందినవారికి కొన్ని  రో్జులపాటు ఫ్రాన్స్‌లో ఈ రాఫెల్‌ యుద్ధవిమానాలను నడుపడంలో శిక్షణ ఇవ్వనున్నారు. గతంలో చేసుకొన్న ఒప్పందం ప్రకారం 18 జెట్లను 2021 ఫిబ్రవరి నాటికి భారత వైమానికదళానికి అందజేయాల్సి ఉంటుంది. మిగిలిన వాటిని 2022 ఏప్రిల్-మే లో అందించేలా ఒప్పందం చేసుకొన్నారు.