కమల్‌నాథ్ మేనల్లుడుపై సిబిఐ దాడులు 

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పురికి చెందిన ఆస్తుల్లో సీబీఐ దాడులు చేసింది. ఢిల్లీ, నోయిడాల్లో రతుల్ పురికి చెందిన పలు ప్రాంగణాల్లో ఈ దాడులు జరిపినట్లు తెలిసింది. 
 
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)తోపాటు ఇతర బ్యాంకుల కన్సార్టియమ్‌కు రూ. 787.25 కోట్లు ఎగ్గొట్టిన కేసులో రతుల్‌ పురిపై పలు అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2012 నుంచి రతుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌గా పని చేస్తున్న మోసర్ బేర్ కంపెనీపై పీఎన్‌బీ ఫిర్యాదును  నమోదు చేసింది.
 
ఈ ఫిర్యాదులో మోసర్ బేర్‌‌లో పని చేసే మిగతా డైరెక్టర్స్, కొందరు గుర్తు తెలియని వ్యక్తులతోపాటు బ్యాంక్ అధికారుల పేర్లనూ సీబీఐ జత చేసింది. కరోనా వ్యాప్తి భయంతో సెర్చ్ టీమ్స్ ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొని ఈ దాడులు నిర్వహించారు. 
 
పీపీఐ కిట్స్ వేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ దాడులు నిర్వహించారని సీబీఐ ప్రతినిధి ఆర్‌‌కే గౌర్ తెలిపారు. కాగా, వివాదాస్పద అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్‌లో కూడా రతుల్ పురి కీలక నిందితుడు కావడం గమనార్హం.