వినాయకుడి విగ్రహాలు సైతం చైనా నుంచే దిగుమతి చేసుకోవడం విడ్డూరంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విస్మయం వ్యక్తం చేశారు. స్వావలంబన భారతదేశం (ఆత్మనిర్బర్ భారత్ అభియాన్) అంటే దిగుమతులు అస్సలు చేయకూడదని కాదని ఆమె స్పష్టం చేశారు.
పారిశ్రామిక వృద్ధికి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవసరమైన దిగుమతులు చేసుకోవచ్చని ఆమె చెప్పారు. వృద్ధిని పెంచేందుకు దిగుమతి చేసుకోవడంలో తప్పు లేదు కానీ, గణేష్ విగ్రహాలను కూడా చైనా నుండే ఎందుకు దిగుమతి చేసుకోవాలని ఆమె ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ అభియాన్ భారత్’ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు బీజేపీ నేతలతో ఆమె వర్చువల్ లింక్ ద్వారా మాట్లాడుతూ దేశంలో ఉద్యోగావకాశాలు కల్పించని, దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడని దిగుమతుల వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.
ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా సాంప్రదాయకంగా స్థానికంగా మట్టితో చేసిన గణేశ విగ్రహాల కొనుగోలుకు బదులుగా వాటిని కూడా చైనా నుండి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారని ప్రశ్నించారు. మనం తయారుచేసుకోలేమా..ఇలాంటి పరిస్థితి ఎందుకో ఆలోచించాలని ఆమె కోరారు.
సబ్బు పెట్టె, ప్లాస్టిక్ పరికరాలు, ధూపం స్టిక్స్ వంటి రోజువారీ వినియోగించే వస్తువులను మన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తయారు చేసినవే వినియోగించి దేశాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్లాలని ఆమె కోరారు.
స్థానికంగా తయారయ్యే అందుబాటులో ఉన్న వస్తువులను దిగుమతి చేసుకునే పరిస్థితి మారాలని ఆమె కోరారు. ఆత్మ నిర్బర్ అభియాన్ వెనుకున్న స్వయం ప్రతిపత్తి ఆలోచన ఇదేనని ఆమె పునరుద్ఘాటించారు.
More Stories
పిల్లల భవిష్యత్తు కు భరోసాగా “ఎన్పీఎస్ వాత్సల్య” నేడే ప్రారంభం
పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్లు
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి