‘చర్మ సౌందర్యం’ ఉత్పత్తులను రద్దు చేయాలి

‘చర్మ సౌందర్యం’ ఉత్పత్తులను రద్దు చేయాలి

‘చర్మం సౌందర్యం’ పేరుతో యూనిలివర్‌ సంస్థ తీసుకువస్తున్న ఉత్పత్తులను పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్‌ దక్షిణాసియా వ్యాప్తంగా వస్తోంది. ఉత్పత్తులకు సంబంధించి ఆ సంస్థ చెప్పిన రీబ్రాండింగ్‌ విధానం సమస్యకు ఎంతమాత్రం పరిష్కారం కాదని, అది కేవలం ఒక జిమ్మిక్కు అని విమర్శకులు పేర్కొంటున్నారు.

యూనిలివర్‌ సంస్థకు చెందిన ‘ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ’ ఉత్పత్తులు ఆసియా వ్యాప్తంగా అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఈ బ్రాండ్‌కు ఉన్న పేరును చూస్తుంటే జాతి వివక్ష మూస ధోరణిని కొనసాగిస్తోందనే విమర్శలు వచ్చాయి. దీనికితోడు ఇటీవల అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఈ జాతివివక్షకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ‘ బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ మూవ్‌మెంట్‌’ పేరుతో పెద్దయెత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్మం పేరుతో నలుపు నుంచి తెలుపు అంటూ వివక్షను ప్రోత్సహించే విధంగా క్రీమ్‌లు అమ్ముతున్న యూనిలివర్‌పై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది.
దీంతో తమ బ్రాండ్‌ నుంచి ‘ఫెయిర్‌’ అనే పదాన్ని తొలగిస్తున్నామని సంస్థ గురువారం ప్రకటించింది. రీబ్రాండింగ్‌ పేరుతో యూనిలివర్‌ చేసిన ప్రకటనపై మిశ్రమ స్పందన లభించింది. కొందరు సంస్థ తీసుకున్న చర్యను అభినందించగా, మరికొందరు సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శిస్తున్నారు. 
 
వేరే పేరుతో తీసుకువస్తామని చెబుతున్న ఈ ప్రొడక్టు మరలా ఒకే వర్ణానికి చెందిన ప్రజలను టార్గెట్‌ చేసేవిధంగా ఉంటే.. మార్పు ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు.