హాట్ స్టార్ కు రామోజీ ఫిల్మ్ సిటీ అద్దె 

ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా స్టూడియో గా పేరొందిన రామోజీ ఫిలిం సిటీని మూడేళ్లపాటు అద్దెకు ఇచ్చారు. కరోనా, లాక్ డౌన్ ల కారణంగా గత నాలుగు నెలలుగా అన్ని సినిమా షూటింగ్ లు ఆగిపోవడం, మరో రెండేళ్ల వరకు షూటింగ్ లు ఎక్కువగా జరిగే అవకాశం లేక పోవడంతో నిర్వహ భారంగా మారి అద్దెకు ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. 
 
పనులేమీ లేకపోవటంతో ఫిల్మ్ సిటీ యాజమాన్యం అక్కడ పనిచేసే సిబ్బందిలో దాదాపు 60 శాతం ఉద్యోగుల వరకూ నో వర్క్-నో పే విధానాన్ని అమలు చేస్తోంది. తప్పనిసరిగా ఉండాల్సిన సిబ్బందిని మాత్రమే ఉద్యోగాలకు రానిస్తున్నారు.  ఫిల్మ్ సిటీని మూడేళ్ళ పాటు హాట్ స్టార్-డిస్నీకి అద్దెకు ఇచ్చారు. 
 
కరోనా కారణంగా రామోజీ గ్రూప్ మొత్తం తీవ్ర ఆర్ధిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అందులో భాగంగానే ఈనాడులో సైతం చాలా మంది ఉద్యోగులకు నిర్భంద సెలవుల విధానం, పేజీలు తగ్గించడం, అదనపు సిబ్బందిని తొలగించే ప్రయత్నం చేయడం వంటి చర్యలు చేపట్టారు. 
 
అద్దెకు తీసుకున్న హాట్ స్టార్-డిస్నీ సంస్థ ఇతర నిర్మాణ సంస్థల షూటింగ్ లకు  అనధికారికంగా అనుమతులు నిలిపివేస్తున్నట్లు ‘రిపబ్లిక్ వరల్డ్.కామ్’ తెలిపింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఫిల్మ్ సిటీని చేతిలో పెట్టుకోవటం ద్వారా రాబోయే రోజుల్లో సొంత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ తోపాటు ఇతర కంటెంట్ క్రియేట్ చేయటం ద్వారా  ఇతరుల కంటే చాలా మెరుగైన పొజిషన్ లో ఉంటామని ఆ కంపెనీ భావిస్తోంది. 
 
గత ఏడాది హాట్ స్టార్ ను డిస్నీ సేకరించిన విషయం తెలిసిందే. ఈ విలీనంతో హాట్ స్టార్ అత్యంత శక్తివంతమైన ఓటీటీ సంస్థగా అవతరించింది. ఇదిలా ఉంటే  ప్రపంచంలోనే అతి  పెద్ద బ్రాండ్ అయిన డిస్నీ ఫిల్మ్ సిటీని పర్యాటక పరంగా..సినిమా, షూటింగ్ ల కోసం ఉపయోగించుకోనుంది.