మారిన చైనా వ్యూహం అర్ధం చేసుకోండి 

1979లో వియత్నాంపై ఓటమి చెందిన తర్వాత చైనా వ్యూహంలో పూర్తిగా మార్పు వచ్చిందని, మరే దేశంపై యుద్ధంతో  తలపడకుండా కొద్దీ, కొద్దిగా ఆయా దేశాల భూభాగాలను ఆక్రమించుకొంటున్నదని బిజెపి ప్రధాన కార్యదర్శి వి రామమాధవ్ చెప్పారు. ఆర్గనైజర్ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్ లో “భారత్ – చైనా సరిహద్దు వివాదం” అంశంపై మాట్లాడుతూ ఆ దేశంతో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవాలని గతంలో మన ప్రధానులు ఎంత కృషి చేసినా ఆ దేశం కలసి రావడం లేదని గుర్తు చేశారు. 

1988లో రాజీవ్ గాంధీ, 1993లో పివి నరసింహారావు, 1998లో దేవెగౌడ చైనాతో శాంతికోసం ఒప్పందాలు చేసుకున్నారని, కానీ ఆ దేశం విద్రోహంకు పాల్పడుతూనే ఉన్నదని చెప్పుకొచ్చారు. చైనాతో భారత్ కు మాత్రమే కాదని, సుమారు 13 దేశాలతో సరిహద్దు సమస్యలు ఉన్నాయని చెబుతూ ఒక వంక సరిహద్దులో మనం కఠినంగా వ్యవహరిస్తూ, మరో వంక దౌత్యపరంగా ఆ దేశంతో ప్రధాని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తెలిపారు. 

స్వభావ రీత్యా భారత ప్రజలు శాంతిని కోరుకొంటారని, కానీ విద్రోహానికి పాల్పడడం చైనా నేతల నైజమని చెబుతూ మన బలహీనతలను ఆసరాగా చేసుకొని గతంలో పలు పర్యాయాలు మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చినా మన నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. 

అయితే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినంగా వ్యవహరిస్తూ ఇంతకు ముందు డొక్కలం వద్ద అయినా, ఇప్పడు గాల్వాన్ లోయ వద్ద అయినా వారిని వెనుకకు తరిమి కొడుతూ వస్తున్నామని గుర్తు చేశారు. 

జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడం ద్వారా మన విధానాన్ని స్పష్టం చేశామని రామ్ మాధవ్ వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ అంటే ఆక్రమిత కాశ్మీర్ కూడా అని స్పష్టం చేశామని, అట్లాగే లడఖ్ అంటే గిలిటీ బాల్తిస్తాన్, ఆకాష్ చిన్ అని కూడా అని తెలియచెప్పామని  గుర్తు చేశారు. మన సరిహద్దులను కాపాడుకోవడంలో ఈ ప్రభుత్వం రాజీ ధోరణి ప్రదర్శింపబోదని తేల్చి చెప్పారు. 

భారత్ చైనాతో యుద్ధం కోరుకోవడం లేదని స్పష్టం చేస్తూ, అదే సమయంలో మన భూభాగంలో ఒక్క అంగుళాన్ని కూడా వదులు కోవడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. 21వ శతాబ్దంలో విధ్వసక వ్యూహాలు చెల్లుబాటు కాబోవని చైనా గుర్తించాలని రామ్ మాధవ్ హెచ్చరించారు. సరిహద్దు ప్రాంతంలో వంతెనలు, రోడ్లు వంటి నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా మన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి సైన్యానికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 

మనదేశంలో కొన్ని శక్తులు చైనా ఆడించినట్లు ఆడుతున్నాయని మండిపడుతూ వారు మన సేనల నైతికతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆర్ ఎస్ ఎస్ సీనియర్ నేత రామ్ లాల్ ధ్వజమెత్తారు.