దేశ చరిత్రలో అత్యంత చీకటి కాలం ఎమర్జెన్సీ 

భారత ప్రధాని ఇందిరా గాంధీ ముందుగా మంత్రివర్గంతో కూడా చర్చించకుండా 1975 జూన్ 25 రాత్రి దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన సమయాన్ని భారత దేశ చరిత్రలో అత్యంత చీకటి కాలంగా భావిస్తారు. ఎందుకంటె 21 నెలల కాలం పాటు జరిగిన అత్యవసర పరిస్థితి కాలంలో ప్రపంచంలో ప్రజాస్వామ్యం కింద ఉన్న ప్రజల సంఖ్య సగానికి సగం పడిపోయింది. 
 
దేశ చరిత్రలో ప్రతిపక్ష నాయకులు అందరిని జైలులో ఉంచి, పత్రికలపై సెన్సార్ షిప్ విధించి, చివరకు కోర్ట్ లు సహితం ఎవ్వరిని అరెస్ట్ చేసినా ప్రశ్నించే అధికారం లేదని వాదించడం జరిగింది. ప్రజల ప్రాధమిక హక్కులను సస్పెండ్ చేసిన్నట్లు ప్రకటించారు.

దేశంలోని పార్లమెంట్, అసెంబ్లీ ల పదవీకాలాన్ని సంవత్సరకాలంపాటు పొడిగించారు. దేశంలో అంతర్గతంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని, తన ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని అంటూ ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద పరిస్థితులలో తాష్కెంట్ లో మృతి చెందిన తరువాత కాంగ్రెస్ పార్టీ లోని సీనియర్లు కొందరు బలహీన నాయకురాలిగా భావించి, తమ చెప్పు చేతలలో ఉంటుందనే ఉద్దేశ్యంతో 1967లో ఇందిరాగాంధీ ని ప్రధమంత్రిగా చేశారు. ఈ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకొని నాలుగేళ్లలో 1971 నాటికల్లా పార్టీలో, ప్రభుత్వంలో తిరుగులేని బలమైన నాయకురాలిగా ఎదిగారు.
 
1971 ఎన్నికల్లో పార్లమెంట్ లో మంచి ఆధిక్యత సాధించడం, మంత్రివర్గాన్ని ప్రక్కకు త్రోసివేసి ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారం కేంద్రీకృతం అయ్యే విధంగా చేయడం, వివిధ రాష్ట్రాలలో బలమైన ముఖ్యమంత్రులను తొలగించి తన చెప్పు చేతలలో ఉండేవారిని నియమించడం చేశారు. ముఖ్యమంత్రులను శాసనసభ పార్టీలు కాకుండా ఢిల్లీ నుండి నామినేట్ చేసే సంస్కృతి ప్రవేశ పెట్టారు.
 
ప్రజాస్వామ్య ధోరణుల సమాధి
 
క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ లో, ప్రభుత్వంలో ప్రజాస్వామ్య ధోరణులను సమాధి చేయడం ప్రారంభించారు. ఈ విషయంలో కాబినెట్ కార్యదర్శిగా పనిచేసిన పి యన్ హస్కర్ పై ఎక్కువగా ఆధారపడటం ప్రారంభించారు. ప్రభుత్వ అధికారులు అందరు అధికార పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని అంటూ `కమిటెడ్ బ్యూరోక్రసీ’ అనే నినాదాన్ని హస్కర్ లేవదీశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో తాను ప్రతిపాదించిన నీలం సంజీవరెడ్డి ని ఓడించి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన వి వి గిరిని గెలిపించడం ద్వారా పార్టీలో వృద్ధ నాయకులు అందరిని గెంటివేశారు. వారిని `సిండికేట్’ గా ముద్రవేసి పార్టీలో చీలిక తీసుకు వచ్చారు. తనకు వ్యక్తిగతంగా కట్టుబడి ఉంటేనే పార్టీలో, ప్రభుత్వంలో ప్రోత్సాహం ఉంటుందనే సంకేతం ఇచ్చారు.

నెహ్రు కుమార్తెగా ప్రజలలో మంచి గ్లామర్ సంపాదించుకోవడం, బ్యాంక్ ల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటి చర్యల ద్వారా పేద ప్రజల ద్రుష్టి ఆకట్టుకోవడం ద్వారా దేశంలో బలమైన నాయకురాలిగా ఎదిగారు. 1971 ఎన్నికల్లో `గరీబీ హటావో’ నినాదంతో ప్రజల మద్దతు పొంది అధికారమలోకి వచ్చారు. ఆ తరువాత బాంగ్లాదేశ్ విముక్తి కోసం సాగించిన యుద్ధంలో భారత్ ఘాన విజయం సాధించడంతో ఆమె కీర్తి మరింతగా పెరిగింది.

అయితే 1971 తర్వాత జిడిపి  వృద్ధి మందగించడం, దేశంలో కరువు, నిరుద్యోగం, చమురు సంక్షోభం వంటి కారణాలతో దేశం ఆర్ధిక సంక్షోభం వైపు మళ్లింది. కారణంగా కార్మికులు, విద్యార్థులలో అశాంతి ప్రబలడం ప్రారంభమైనది.

రైల్వే కార్మికుల డిమాండ్ లకు మద్దతుగా అఖిల భారత రైల్వేమెన్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా జార్జ్ ఫెర్నాండెస్ 1974లో చేపట్టిన కార్మికుల సమ్మెను ఇందిరా ప్రభుత్వం దారుణంగా అణచివేశారు. ఎటువంటి అసమ్మతి, విమర్శలను సహించలేని పరిస్థితులకు చేరుకున్నారు.

మరోవంక అహ్మదాబాద్ లోని ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ లో మెస్ చార్జీలతో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా డిసెంబర్, 1973లో ప్రారంభమైన విద్యార్థుల నవ నిర్మాణ్ సమితి ఉద్యమం గుజరాత్ లో చిమన్ భాయి పటేల్ ప్రభుత్వ రాజీనామాకు దారితీసింది. 

ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ బీహార్ లో ఛాత్ర సంఘర్ష సమితి ఆధ్వర్యంలో అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు తలపెట్టిన ఉద్యమానికి సహితం జెపి మద్దతు ప్రకటించారు.

అవినీతి పరులకు అండగా ఇందిరా

ఇందిరాగాంధీ హయాంలో తెరపైకి వచ్చిన పలు అవినీతి ఆరోపణలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. గుజరాత్ లో కాంగ్రెస్ అధికారం కోల్పోవలసి వచ్చింది. బీహార్ లో సహితం ఈ విషయమై విద్యార్థులు, యువజనులు పెద్ద పెట్టున ఉద్యమం ప్రారంభించారు.

1971 మే లో నగర్వాలా అనే వ్యక్తి ఫోన్ లో ఇందిరా గాంధీ వలే మాట్లాడి అత్యవసరంగా రూ 60 లక్షలు కావలి అంటే స్టేట్ బ్యాంకు మేనేజర్ మల్హోత్రా ఇవ్వడం, ఆ తరువాత ప్రధాని కార్యాలయానికి రసీదు కోసం వెడితే అసలు ఫోన్ చేయలేదని తేలడం ఒక ప్రవాసంగా మారింది. తాను కొరియర్ మాత్రమే అని నగర్వాల్ చెప్పడం గమనార్హం.

విస్మయం కలిగించే రీతిలో కోర్ట్ లో ఈ కేసు విచారణను పది నిముషాలలో పూర్తి చేసే నగర్వాల కు నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. నిర్బంధంలో ఉండగానే అతను అనుమానాస్పద పరిస్థితులలో మృతి చెందారు.

ఇక 1971లో స్వదేశీ కార్ ఉత్పత్తి సంస్థ `మారుతి ఉద్యోగ్’ కు సంజయ్ గాంధీ ని మేనేజింగ్ డైరెక్టర్ గా అనుమతి ఇవ్వడం మరో అవినీతి ప్రహసం. కార్ల ఉత్పత్తిలో ఎటువంటి అనుభవం లేకుండా, ఎటువంటి సాంకేతిక సామర్ధ్యం చూపకుండా, డిజైన్ లు లేకుండా, సాంకేతిక సామర్ధ్యం గలవారెవ్వరితో ఒప్పందం లేకుండా జరిగిన స్వదేశీ కారు ఉత్పత్తికి లైసెన్స్ అవ్వడం పలు విమర్శలకు దారితీసింది. 

`సంపూర్ణ విప్లవం’ కోసం జెపి పిలుపు

క్రమంగా విద్యార్థి, యువజన ఉద్యమాలు జాతీయ స్థాయిలో అవినీతికి వ్యతిరేకంగా పెరుగుతూ ఉండడంతో `సంపూర్ణ విప్లవం’  మహోద్యమానికి జయప్రకాశ్ పిలుపిచ్చారు. దానితో తన అధికారం కదులుతున్నట్లు ఇందిరాగాంధీ భయపడ్డారు. తనను కుమార్తెగా ఆప్యాయంగా పిలిచే జయప్రకాశ్ పై అనుచిత వాఖ్యలకు దిగారు. 

దానితో `సంపూర్ణ విప్లవం’ కోసం జాతీయ స్థాయిలో విద్యార్థి, యువజన ఉద్యమం ఆయన సారధ్యంలో ఊపందుకోవడం ప్రారంభమైనది. అందుకోసం అన్ని రాష్ట్రాలలో పర్యటనలు ప్రారంభించారు. ఈ ఉద్యమంలో ఎబివిపి కీలక పాత్ర వహించింది.

1975 జూన్ 12 నిర్ణయాత్మక దినంగా మారింది. అదే రోజు జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఓటమి చెంది జనతా ఫ్రంట్ గెలుపొందింది. ఈ ఫ్రంట్ తదుపరి 1977లో జనతా పార్టీ ఏర్పాటుకు దారితీసింది. అదే రోజున ఇందిరా గాంధీ పై లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చెందిన రాజ్ నారాయణ్ వేసిన పిటిషన్ పై ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హై కోర్ట్ తీర్పు ఇచ్చింది.

అంతకు ముందు రైల్వే మంత్రి ఎల్ ఎన్ మిశ్ర బీహార్ లో ఒక సభలో ప్రసంగిస్తూ ఉండగా బాంబు ప్రేలి చనిపోవడం వంటి  సంఘటనలు దేశంలో శాంతిభద్రతలు క్షీణించి పోవడాన్ని వెల్లడి చేస్తున్నాయి. పార్లమెంట్ లో సహితం ఇందిరాగాంధీ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొనవలసి వచ్చింది. 

ఆమెను పార్లమెంట్ కు రప్పించడం కోసం ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ పెట్టడం చేయవలసి వచ్చెడిది. బహుశా మరే ప్రధానమంత్రి ఎదుర్కొనని అవిశ్వాస తీర్మానాలను అత్యధిక సంఖ్యలో 10 వరకు ఆమె ఎదుర్కొన్నారు.

అలహాబాద్ హై కోర్ట్ తీర్పును ఇందిరా గాంధీ సుప్రీం కోర్ట్ లో సవాల్ చేశారు. హై కోర్ట్ తీర్పును సమర్ధిస్తూ ఆమె యంపీగా ఎటువంటి సదుపాయాలు పొందరాదని, పార్లమెంట్ లో వోటింగ్ లో పాల్గొనరాదని స్పష్టం చేసారు. అయితే ఆమె ప్రధానమంత్రిగా కొనసాగవచ్చని చెప్పారు. 

దానితో ప్రతిపక్షాలు జయప్రకాశ్ నాయకత్వంలో ఆ మరుసటి రోజు ఢిల్లీ లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి, ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆమె గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసే అనైతిక, చట్టవ్యతిరేక ఉత్తరువులను పోలీస్ లు తిరస్కరించాలని సహితం  పిలుపిచ్చారు.

ఈ విషయమై ఆమెపై వత్తిడి తీసుకు రావడం కోసం లోక్ సంఘర్ష సమితి ని మొరార్జీ దేశాయ్ అధ్యక్షునిగా, నానాజీ దేశ్ ముఖ్ కన్వీనర్ గా ఏర్పాటు చేస్తున్నట్లు జెపి ప్రకటించారు.స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ సహితం ఇటువంటి పిలుపు ఇచ్చారని గుర్తు చేసారు.

మంత్రివర్గంకు తెలియకుండానే ఎమర్జెన్సీ 

ఇక పదవిలో కొనసాగడం అసంభవం అని గ్రహించిన ఇందిరాగాంధీ ఆ రాత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించమని రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ను కోరారు. ఈ వార్త మరుసటిరోజు కనిపించకుండా చేయడం కోసం మూడు గంటలలో అన్ని ప్రధాన వార్త పత్రికలకు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. ప్రతిపక్ష నాయకులూ అందరిని అరెస్ట్ చేశారు. 

కేంద్ర మంత్రివర్గంపై తెలియకుండానే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ మరుసటిరోజు ఉదయం మంత్రివర్గాన్ని సమావేశ పరిచి ఈ ప్రకటనను ఆమోదించేటట్లు ఆమె చేసుకున్నారు.

కొద్దీ కాలం క్రితమే పాకిస్థాన్ తో యుద్ధం జరగడం, చమురు సంక్షోభం, ప్రతిపక్షాల ఆందోళనలు కారణంగా జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడినదని అత్యవసర పరిస్థితికి సాకుగా చూపారు. అత్యవసర పరిస్థితిని ఏర్పాటు చేయాలని అంటూ రాష్త్రపతికి పంపిన లేఖను అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్దార్ధ శంకర్ రే తయారు చేశారు. 

రాజ్యాంగ పరిధిలో ప్రజాస్వామ్య స్వాతంత్రాలను ఏవిధంగా కట్టడి చేయాలో ఆయనే ఇందిరాగాంధీకి సూచించారు. అత్యవసర పరిస్థితి కాలంలో కొద్దిమంది అధికారులు, అప్పటికే `రాజ్యాంగేతర శక్తీ’ గా ఎదుగుతున్న చిన్నకుమారుడు సంజయ్ గాంధీ అసలైన అధికారాన్ని వెలగబెట్టారు.

జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, ఏ బి వాజపేయి, జార్జ్ ఫెర్నాండెస్, మధు దండావతే, నానాజీ దేశముఖ్, ఎల్ కె అద్వానీ, యం కరుణానిధి, జె బి పట్నాయక్, జ్యోతిబస్, ఎచ్ డి దేవెగౌడ, ములాయం సింగ్ యాదవ్, ఎల్ కె అద్వానీ వంటి ప్రతిపక్ష నాయకులు అందరిని అరెస్ట్ చేశారు.

దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రెస్ సెన్సార్ షిప్ విధించారు. 1976లో పార్లమెంట్ కు హోమ్ మంత్రి తెలిపిన ప్రకారం అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ సాహిత్యాన్ని పంపిణి చేస్తున్న 7,000 మందిని అరెస్ట్ చేశారు.

అత్యవసర పరిస్థితి కాలంలో జరిగిన అత్యాచారాల గురించి దర్యాప్తు జరిపిన షా కమీషన్ నివేదిక ప్రకారం ఈ సమయంలో 1,10,806 మందిని నిర్బంధించడమో, అరెస్ట్ చేయడమో చేశారు. 

రాజ్యాంగాతీత శక్తిగా విజృభించిన సంజయ్ గాంధీ బలవంతపు కుటుంభం నియంత్రణ శిబిరాలు నిర్వహించారు. తమ ఇళ్లను అక్రమంగా కూల్చడం పట్ల నిరసన వ్యక్తం చేసిన ప్రదర్శకులపై 1976లో పోలీస్ కాల్పులు జరిపి, ఢిల్లీ ని పరిశుభ్రం చేసుకోవడానికి అని సమర్ధించుకున్నారు.

మహోత్తర సత్యాగ్రహోద్యమం 

అత్యవసర పరిస్థితి సమయంలో రాజకీయ నేతలు అందరు జైళ్లలో ఉండడంతో, బైట ఉన్న నేతలు చాలావరకు ఇంటికి పరిమితమయ్యారు.ఈ సందర్భంగా నిషేధానికి గురైన ఆర్ ఎస్ ఎస్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మహోత్తరమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని జరిపింది. 

ప్రజలకు వాస్తవాలు  తెలపడం కోసం వేలాది రహస్య పత్రికలు నడిపింది. దేశంలో జరుగుతున్న విషయాలను ఇంటింటికి వెళ్లి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సత్యాగ్రహ ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే శాంతియుతంగా జరిగిన అతిపెద్ద ప్రజా ఉద్యమం. 

60,000 వేల మందికి పైగా ఎమర్జెన్సీ ని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేస్తూ స్వచ్ఛందంగా జైళ్లకు వెళ్లారు. నిషేధానికి గురైన నక్సలైట్లు సహితం ఆ సమయంలో మౌనంగా ఉండిపోయారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన సిపిఎం సహితం చెప్పుకోదగిన పోరాటాలు చేయలేక పోయింది. 

స్వతంత్ర పోరాట సమయంలో సహితం ఎమర్జెన్సీ సమయంలో వలే లక్ష మందికి పైగా అరెస్ట్ కాలేదు. ఆ సమయంలో అత్యధికంగా 30,000 కు మించి ఎన్నడూ అరెస్ట్ కాలేదు. 

మరోవంక విదేశాలలో సహితం భారత దేశంలో జరుగుతున్న విషయాలను ప్రచారం చేయడంతో ఇందిరా గాంధీ అన్ని వైపులా నుండి వత్తిడులు ఎదుర్కొన్నారు. దానితో ఎన్నికలు జరపగా తప్పలేదు. ఆ ఎన్నికలలో ఘోరంగా ఓటమి చెందారు. మొత్తం ఉత్తరాదిన  ఒక్క సీట్ కూడా గెల్చుకోలేక పోయారు. జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది.