అది తిర‌స్క‌ర‌ణ‌కు గురైన రాచ‌కుటుంబం

కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా విరుచుకుప‌డ్డారు. వ‌రుస ట్వీట్ల‌తో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయి విమ‌ర్శ‌లు చేశారు.  మోదీ స‌ర్కార్ త‌ప్పుడు విధానాల వ‌ల్లే భార‌త్, చైనా స‌రిహ‌ద్దు స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైన‌ట్లు కాంగ్రెస్ ఆరోపించిన నేప‌థ్యంలో జేపీ న‌డ్డా ఇవాళ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా కౌంట‌ర్ ఇచ్చారు.  

తిర‌స్క‌రించిన‌, ఎగిరిపోయిన రాజ‌వంశం మొత్తం విప‌క్షం క‌లిసినా వారి ముందు దండ‌గే అని కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. ఒక కుటుంబానికి ఉన్న ఆస‌క్తి  అది దేశ ప్ర‌యోజ‌నాల‌కు వ‌ర్తించ‌దని స్పష్టం చేశారు.  భార‌త సాయుధ ద‌ళాల ప‌ట్ల దేశ‌మంతా ఐక్యంగా, మ‌ద్ద‌తుగా ఉన్న‌ద‌ని, ఇది ఐక్య‌త‌ను, సంఘీభావాన్ని చాటాల్సిన స‌మ‌యం అని న‌డ్డా త‌న ట్వీట్‌లో పిలుపిచ్చారు.

ప్ర‌ధానితో జ‌రిగిన అఖిల ప‌క్ష స‌మావేశంలో విప‌క్షాలు ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం స‌హ‌జ‌మే అని, ఆ స‌మావేశాల్లో చాలా ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, అనేక మంది విప‌క్ష నేత‌లు ఎంతో ఉత్త‌మ‌మైన స‌ల‌హాలు ఇచ్చార‌ని, చైనా అంశంలో ఎలా ముందుకు వెళ్లాల‌న్న దానిపై కేంద్రానికి విప‌క్షాలు మ‌ద్ద‌తు ఇచ్చాయ‌ని నడ్డా గుర్తు చేశారు. 

కానీ, కేవలం ఒక కుటుంబం మాత్రం అది స‌హించ‌లేక‌పోయింద‌ని, అదెవ‌రో మీరు గ్ర‌హించ‌గ‌ల‌ర‌ని అనుకుంటా అని న‌డ్డా త‌న ట్వీట్‌లో ఎద్దేవా చేశారు. ఒక రాచ‌కుటుంబం చేసిన త‌ప్పుల వ‌ల్ల‌.. మ‌న భూభాగానికి చెందిన వేల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల నేత ఇత‌ర దేశాల‌కు ధారాద‌త్త‌మైంద‌ని న‌డ్డా ఆరోపించారు.

సియాచిన్ గ్లేసియ‌ర్‌ను వారి వ‌ల్ల‌నే మ‌నం కోల్పోవాల్సి వ‌చ్చింద‌న్నారు.  ఆ ఒక్క కుటుంబం వ‌ల్ల ఎన్నో కోల్పోయామని మండిపడ్డారు. దేశ ప్ర‌జ‌లు ఆ కుటుంబాన్ని తిర‌స్క‌రించ‌డం ఆశ్చ‌ర్యం కాదని జేపీ న‌డ్డా తెలిపారు.