కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా ధారవి!

కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా ధారవి!
ప్రాణాంతక వైరస్ గా పరిణమించిన కరోనా మహమ్మారి కట్టడికి భారత దేశం జరుపుతున్న పోరాటానికి ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా పేరొందిన ముంబైలోని ధారవిలో సాధించిన విజయం మొత్తం దేశానికి మార్గదర్శకంగా ఉండే అవకాశం ఉంది. 
 
రోజువారీ కేసులు గణనీయంగా తగ్గడంతో పాటు, అక్కడ ప్రజారోగ్యం, సామూహిక జీవన చర్యల విషయంలో తీసుకున్న చర్యలు, అనుభవాలు దేశంలోని అన్ని నగరాలకు గుణపాఠంగా పనికివచ్చే అవకాశం ఉంది. 
 
సుమారు 10 లక్షల జనాభాతో, 2.1 చదరపు కిమీ విస్తీర్ణంలో నెలకొన్న ఈ మురికివాడలో ఇల్లు చాల ఇరుకుగా, మురికిగా, తగు పారిశుధ్య చర్యలు లేకుండా ఉండడంతో ఇక్కడకు వైరస్ వ్యాప్తి చెందితే కట్టడి చేయడం కష్టమని తొలుత భయపడ్డారు. ప్రపంచంలోనే అతి ఇరుకైన మురికి వాడగా దీనికి పేరుంది. 
 
ఇక్కడ తేలికగా వైరస్ సామాజిక వ్యాప్తి చెందగలదని భావించారు. 100 చ. మీ మేరకు ఉండే గుడిసెలలో 5 నుండి 10 మంది వరకు నివసిస్తారు. 80 శాతం మంది సామజిక మరుగుదొడ్లపై ఆధార పడుతూ ఉంటారు. ఇరుకైన రోడ్లు, ఫ్యాక్టరీలు, ఇల్లు కల్సి ఉంటాయి.
చాలామంది రోజువారీ కూలీతో పనిచేసే వారు కావడంతో బైటనే భోజనం చేస్తారు. ఇళ్లల్లో వంట చాలా తక్కువమంది చేస్తుంటారు. ఇక్కడ సాంఘిక దూరం పాటించడం అసాధ్యం.
 
ఏప్రిల్ 1న మొదటి కేసు నమోదు కాగా, ఇప్పటికి సుమారు 2,000 కేసులు నమోదయ్యాయి. 80 మంది చనిపోయారు. అయితే సగం మందికి పైగా కోలుకున్నారు. ఏప్రిల్ లో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 18 రోజులు పడితే, మే లో 43 రోజులు, జూన్ లో 80 రోజులకు పెరిగింది.
ముంబై మునిసిపల్ అధికారులు, ప్రైవేట్ వైద్యులు, సామజిక కార్యకర్తలు, శాసనసభ్యులు కలిసి ఉమ్మడిగా చేసిన కృషి అసాధారణమైన ఫలితాలు ఇచ్చింది. రోజువారి కేసులు మేలో ఒక రోజున అత్యధికంగా 43 ఉండగా, జూన్ మూడోవారం వచ్చేసరికి  19కి తగ్గించ గలిగారు. 
కఠినంగా కంటైన్మెంట్ చర్యలు తీసుకోవడం, విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు జరపడం, బైటకు పనికి వెళ్లేవారికి ఆహారం ఏర్పాటు చేయడం వంటి పలు చర్యలతో కరోనాను కట్టడి చేయగలిగారు.
ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేయడం, జ్వర శిబిరాలు నిర్వహించడం, సంచార వైద్యం అందించడం వంటి పలు చర్యలు తీసుకున్నారు. జ్వరం లక్షణాలు కనిపించిన వారికి అక్కడికక్కడే పరీక్షా జరిపి నిర్ధారిస్తున్నారు. ప్రజలలో అవగాహన కలిపించడమతొ ఏమాత్రం లక్షణాలు కనిపించినా స్వచ్ఛందంగా వచ్చి పరీక్ష చేసుకొంటున్నారు.
మునిసిపల్ ఆరోగ్య కార్యకర్తలు 4.76 లక్షల మందికి స్క్రీనింగ్ జరుపగా, ప్రైవేట్ వైద్యుల సహకారం తీసుకొని మరో 47,000 మందికి చేశారు. మొదట్లో  ఇక్కడ వైద్య పరీక్షలు జరపడానికి వైద్యులు సహితం భయపడ్డారు. ఇక్కడ వైరస్ ను కట్టడి చేయడం అసాధ్యం అనే నిర్ధారణకు కూడా వచ్చారు.
మొదట్లో ఇద్దరు లేదా ముగ్గురు ప్రైవేట్ వైద్యులు ముందుకు వచ్చారు. ఇప్పుడు 200 మంది పనిచేస్తున్నారు. ప్రైవేట్ వైద్యులు అందరికి ఆరోగ్య అధికారులు వ్యక్తిగత రక్షణ పరికరాలు, రోగులను పరీక్షించడంలో శిక్షణ ఇచ్చారు.
రోగ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని మాత్రమే ఆసుపత్రులకు పంపి, మిగిలిన వారికి అక్కడనే చికిత్స ఇచ్చారు. అయితే వృద్దులు సుమారు 10 వేల మందిని తాత్కాలిక కొరెంటైన్ కేంద్రాలకు పంపి, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడ్డారు.
స్థానిక పాఠశాలలను, కల్యాణ మండపాలను, క్రీడా మండపాలను తాత్కాలిక క్వారంటైన్ లుగా మార్చారు. అక్కడ ఉన్నవారికి సామూహికంగా వంట ఏర్పాటు చేశారు. 24 గంటలు వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. 90 శాతం రోగులకు అక్కడనే వైద్య సేవలు అందించారు.
 స్థానికంగా నివాసం ఉండే వారికి శాసన సభ్యులు, కార్పొరేటర్లు, ఎంపీలు ఆహరం, ఇతర ఇంట్లో ఉపయోగించే వస్తువులను అందించారు. సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వైద్య పరికరాలు, ఇతర సహాయ సహకారాలు అందించారు.